అర్ధరాత్రి తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తుండగానే అపహరణ
విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలో కలకలం
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
బాలికను గుర్తించిన పోలీసులు... తల్లిదండ్రులకు అప్పగింత
అల్లిపురం: కళ్ల ముందే తమ కుమార్తెను నిద్రపుచ్చిన తరువాత తల్లిదండ్రులు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి పక్కనే నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారి కనిపించలేదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని బస్టాప్ వద్ద ఫుట్‌పాత్‌పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ ఘని, సయ్యద్ శేషమ్మ దంపతులు కడప జిల్లా రైల్వేకోడూరులో స్థిరపడ్డారు. షాపులకు ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోసం 3 రోజుల క్రితం విశాఖపటా్ననికి వచ్చిన వారు తమ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై గురువారం అర్ధరాత్రి నిద్రించారు.
తెల్లవారుజామున నిద్రలేచి చూడగా కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురికావడంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి డీసీపీ–1 సూచనల మేరకు ఏసీపీ లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఓ యువతి, యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలికను తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుసుకున్న పోలీసులు వారు ఎస్.రాయవరం ప్రాంతానికి చెందిన ప్రతిభ, గరివిడి ప్రాంతానికి చెందిన ఉపేంద్రగా గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా బాలికను గాజువాక వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ద్విచక్రవాహనం నంబరు ఆధారంగా బాలిక ఎస్.రాయవరం ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని చిన్నారిని సురక్షితంగా కాపాడారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అయితే బాలికను తీసుకెళ్లిన వారి నేపథ్యం ఏమిటీ? ఎందుకు తీసుకెళ్లారు. వీరి వెనుక ఎవరున్నారు? తదితర అంశాలను పోలీసులు వెల్లడించలేదు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని, ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు.


