ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో అధ్వాన భోజనం
10 రోజులుగా విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు
పట్టించుకోని వార్డెన్,
కళాశాల యాజమాన్యం
తగరపువలస: భీమిలి మండలం నేరెళ్లవలసలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో విద్యార్థినులకు పురుగుల భోజనమే దిక్కవుతోంది. గత 10 రోజులుగా వసతి గృహంలో వడ్డిస్తున్న వంటకాల్లో తరచూ పురుగులు వస్తుండటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లెదుటే పురుగులు కనిపిస్తుండటంతో ఆ భోజనం తినలేక పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టని వైనం
ఈ విషయాన్ని వార్డెన్, అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంతోనే వంట చేస్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. నాణ్యమైన బియ్యం తెప్పించే ఏర్పాట్లు చేయడం లేదు. శుక్రవారం ఉదయం పెట్టిన కిచిడీతో పాటు మధ్యాహ్నం వడ్డించిన అన్నం, కూరల్లోనూ పురుగులు రావడంతో విద్యార్థినులు విస్తుపోయారు.
ఇంటికి తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులకు వేడుకోలు: పురుగులతో ఉన్న ఆహారాన్ని ఫొటోలు తీసి తమ తల్లిదండ్రులకు పంపిన విద్యార్థినులు.. నాణ్యమైన భోజనం పెట్టే వరకు తమను ఇళ్లకు తీసుకెళ్లిపోవాలని వేడుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ హాస్టల్ భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారుల్లో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.


