ఎంవీపీ కాలనీ: మారికవలసలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఎంవీపీ కాలనీలో నిర్వహించిన సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, అయితే ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి, అన్ని వర్గాలతో చర్చించాలని కోరారు. ఆదివాసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతున్న పాఠశాలను ఆకస్మికంగా రద్దు చేయడం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలను పునరుద్ధరించి విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హక్కుల పరిరక్షణ కోసం తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సోనాయి అప్పలరాజుతో పాటు రాథోడ్, ప్రసాదరావు, తిలక్, రాము, కొక్కుల రామా రావు, చిన రామునాయుడు, కిముడు రామారావు, ఓలేసి రామలింగం, అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.


