కన్నీటి సంద్రంలో ఆనంద కెరటాలు | Seven fishermen returned safely | Sakshi
Sakshi News home page

కన్నీటి సంద్రంలో ఆనంద కెరటాలు

Aug 29 2026 4:42 AM | Updated on Aug 29 2026 4:42 AM

Seven fishermen returned safely

క్షేమంగా తిరిగివచ్చిన ఏడుగురు మత్స్యకారులు 

ఘనస్వాగతం పలికిన ఓడలరేవు గ్రామస్తులు 

కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం  

నరకయాతన అనుభవించామంటూ కంటతడి 

పశ్చిమ బెంగాల్‌ మత్స్యకారులు దేవుళ్లలా తారసపడ్డారని వెల్లడి

అల్లవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల మూడో తేదీన చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు 25 రోజుల తరువాత శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌ దిఘా పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం పది గంటలకు ఓడలరేవు చేరుకున్నారు. వీరిలో కాకినాడకు చెందిన సంగాడి తాతారావు, ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన కాటాడి సతీష్‌ తమ ప్రాంతాల్లోనే వాహనం దిగేశారు.

మిగిలిన ఐదుగురు మత్స్యకారులు కొపనాతి రామకృష్ణవర్మ, కొల్లాటి ఏసుదాసు, పాలెపు శాంతారావు, కర్రి రాముడు, కొల్లాటి శ్రీనుబాబుతో పాటు బెంగాల్‌కు చెందిన బోటు యజయానులు పురుషోత్తం, బర్మాన్‌లు ఓడలరేవు చేరుకున్నారు. వీరికి ఓడలరేవు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 25 రోజుల తర్వాత తమ వారిని చూసేసరికి తీవ్ర భావోద్వేగానికి లోనై ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బోరున విలపించారు.

నరకయాతన అనుభవించాం 
ఈ సందర్భంగా మత్స్యకారులు తమ ఆవేదనను వివరించారు. సముద్రంలో నరకయాతన అనుభవించామన్నారు. బియ్యం వండుకొని నీళ్లు పోసుకొని ఆకలి మంట తీర్చుకున్నామని చెప్పారు. ఒక్క బోటు కూడా తారసపడలేదని, బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. ‘‘ ఈ నెల మూడో తేదీన ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వెళ్లాం. ఆ సాయంత్రం వేట ప్రాంతానికి చేరుకుని రాత్రికి అక్కడే ఉండి వేట సాగించాం.

ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా, బోటు ఇంజన్‌ స్టార్ట్‌ కాక గాలివాటానికి లోపలికి వెళ్లాం..ఈ నెల 26న తీరానికి 70 మైళ్ల దూరంలో కనిపించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన బోటులోని వారికి పరిస్థితి వివరించాం. బోటు యజమానులు పురుషోత్తం, బర్మాన్‌ల సూచనలతో దిఘా తీరానికి చేర్చి చికిత్స, ఆహారం అందించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఇక్కడికి చేరుకున్నాం’’ అని మత్స్యకారులు తెలిపారు.  

రక్షించిన బెంగాల్‌ వాసులకు ఘన సన్మానం 
బెంగాల్‌ తీరానికి 70 నాటికల్‌ మైళ్ల దూరంలో ఓడలరేవు తీరానికి చెందిన బోటులోని మత్స్యకారులను గుర్తించి, దిఘా తీరానికి చేర్చి వారికి ఆహారంతో పాటు చికిత్స అందించి స్వగ్రామానికి తీసుకొచ్చిన బోటు యజమానులు పురుషోత్తం, బర్మాన్‌లను ఎంపీ హరీష్‌ ఘనంగా సన్మానించారు. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్దిరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సత్తిబాబురాజు, ఆర్డీఓ సరళావతి, మత్స్యశాఖ జేడీ కరుణాకర్, మెరైన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్, మెరైన్‌ సీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆకలి దప్పులతో అల్లాడిపోయాం
చేపల వేటకు వెళ్లి బోటు ఇంజన్‌ పాడవ్వడంతో నరకయాతన అనుభవించాం. తినడానికి తిండి లేక పస్తులున్నాం.పెద్ద పెద్ద కెరటాల తాకిడికి బోటు అల్లాడింది. బోటుకు ముందు, వెనుక భారీ చేపలు అనుసరించాయి. బెంగాల్‌ మత్స్యకారులు కనిపించకపోయి ఉంటే మా పరిస్థితి దారుణంగా ఉండేది.  – కొపనాతి రామకృష్ణవర్మ, బోటు యజమాని, కొమరగిరిపట్నం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement