మరోసారి ‘మేత’ మోత | Companies write to government seeking permission to increase shrimp feed price | Sakshi
Sakshi News home page

మరోసారి ‘మేత’ మోత

Aug 29 2026 4:59 AM | Updated on Aug 29 2026 4:59 AM

Companies write to government seeking permission to increase shrimp feed price

రొయ్యల మేత టన్నుకు రూ.15 వేల వరకు పెంపునకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి కంపెనీల లేఖ  

టన్ను వెనామీ ఫీడ్‌పై రూ.5,700, టైగర్‌ ఫీడ్‌పై రూ.3,850 పెంచుతున్నట్టు ఎస్‌కే రెట్టింగ్‌ కంపెనీ ప్రకటన  

అప్సడా చట్టానికి తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్న ఫీడ్‌ కంపెనీలు  

టన్నుకు ఫిబ్రవరిలో రూ.4 వేలు, జూన్‌లో రూ.12 వేలు పెంచిన వైనం  

నెలవారీ మామూళ్ల మత్తులో కంపెనీలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం  

ఆక్వా రైతుల్లో తీవ్ర ఆందోళన   

సాక్షి, అమరావతి: రొయ్యల మేత ధరల పెంపునకు టీడీపీ ‘మేత’వన్నె పులులు మరోసారి తెగబడుతున్నాయి. ఇప్పటికే సెపె్టంబర్‌ 1వ తేదీ నుంచి టన్నుకు వెనామీ రొయ్య ఫీడ్‌పై రూ.5,700, టైగర్‌ రొయ్యల ఫీడ్‌పై రూ.3,850 చొప్పున పెంచుతున్నట్టు గుజరాత్‌కు చెందిన ఎస్‌కే రెట్టింగ్‌ కంపెనీ ఏకపక్షంగా ప్రకటించగా మన రాష్ట్రంలోని ‘పచ్చ’ ఫీడ్‌ కంపెనీలు ఏకంగా టన్నుకు రూ.15 వేలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. నెలవారీ మామూళ్ల మత్తులో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వారు అడిగిందే తడవుగా ధరల పెంపునకు పచ్చజెండా ఊపనుండడం రైతులకు పెనుభారం కానుంది. 

ఇప్పటికే రెండు విడతల్లో టన్ను మేతపై రూ.16 వేలు పెంచిన కంపెనీలు ఈసారి అంతకుమించి భారం మోపేందుకు సిద్ధమవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం ధరల పెంపు అనివార్యమైతే తొలుత అప్సడా స్టేక్‌ హోల్డర్స్‌ (ఆక్వా రైతులు, సంఘాల నేతలు)తో సమావేశమవ్వాలి. వారితో చర్చించి వారి అంగీకారంతోనే ధరలను పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ.. ప్రభుత్వ అనుకూల రైతులు, ఫీడ్‌ కంపెనీల భాగస్వామ్యంతో సమాంతరంగా ఏర్పాటు చేసిన కమిటీలతో నాటకాలాడుతోంది. 

దశాబ్దాలుగా సాగుచేస్తున్న రైతులు, రైతుసంఘాలతో చర్చించకుండానే కంపెనీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేల చొప్పున ఫీడ్‌ ధరలను పెంచేశాయి. ముడిసరుకుల ధరల పెంపు సాకుతో ఏప్రిల్‌ 30న వెనామీ ఫీడ్‌పై రూ.12 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.14 వేల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే మే 11న  వెనామీ ఫీడ్‌పై రూ.8,430, టైగర్‌ ఫీడ్‌పై రూ.10,520 చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించాయి. 

ఆక్వా రైతుల ఆందోళనలు, వైఎస్సార్‌సీపీ పోరుబాట ఫలితంగా కొద్దిరోజులు పెంపును వాయిదా వేసినప్పటికీ ఏకాభిప్రాయ సాధన లేకుండానే జూన్‌ 13 నుంచి టన్ను వెనామీ ఫీడ్‌పై రూ.10 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.12 వేల చొప్పున పెంచేశాయి. ఈ పెంపుపై ఆందోళన బాటపట్టిన రైతులను శాంతింపజేసేందుకు టన్నుకు రూ.4 వేలు తగ్గించేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని సీఎం చంద్రబాబు జూన్‌ 18న ప్రకటించగా, మెజార్టీ కంపెనీలు తాము తగ్గించేదేలేదని తేల్చిచెప్పాయి. మార్కెట్‌లో పెద్దగా డిమాండ్‌ లేని ఒకటి రెండు చిన్న కంపెనీలు టన్నుకు రూ.2 వేల తగ్గింపుతో సరిపెట్టాయి.  

సెప్టెంబర్ 1 నుంచి పెంచాల్సిందే..  
ఆ తర్వాత ధరల పెంపుపై అధ్యయన కమిటీ ఏర్పాటు పేరిట నాటకాలాడిన ప్రభుత్వం 45 రోజులకోసారి ధరల పెంపునకు పరోక్షంగా పచ్చజెండా ఊపింది. దీంతో రెండున్నర నెలలు తిరక్కుండానే మరోసారి రైతులకు వాతపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. టన్ను ధర రూ.37 వేలకు తక్కువకాకుండా పెంచితేగానీ తమకు గిట్టుబాటు కాదన్నాయి. కనీసం రూ.15 వేల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఫీడ్‌ ధరల పెంపు అజెండాతో శుక్రవారం ఫీడ్‌ ప్రైస్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశమైంది. 

తాము ప్రతిపాదించిన మేరకు మేత ధరను సెపె్టంబర్‌ 1 నుంచి పెంచేందుకు అనుమతి ఇవ్వకపోతే ప్లాంట్లు నడపలేమని కంపెనీల ప్రతినిధులు తెగేసి చెప్పారు. సమావేశానికి హాజరైన ప్రభుత్వ అనుకూల రైతు ప్రతినిధులు తొలుత కౌంట్‌ల మధ్య తగ్గిన ధరల వ్యత్యాసాన్ని క్రమబద్దీకరించిన తర్వాతే ధరల పెంపుపై చర్చిద్దామంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. కౌంట్‌ ధరల తగ్గింపుతో తమకు సంబంధంలేదని ఫీడ్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ నెల 31వ తేదీన మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.  

రెండేళ్లలో మేత భారం భారీగా..
రొయ్యల సాగులో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న మన రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. రైతులు రొయ్యలకు ఏడాదికి 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తున్నారు. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్‌దే. ఆ తర్వాత 20 శాతం దేవి ఫీడ్స్‌ది కాగా, మిగిలిన 30 శాతం బీఎంఆర్, సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్‌ వంటి ఇతర సంస్థలది. అవంతి, బీఎంఆర్, సంధ్య, దేవి ఫీడ్‌ కంపెనీల్లో అధికార టీడీపీ నేతలే భాగస్వాములు. ఫీడ్‌ కంపెనీల నుంచి నెలవారీగా వాటాల మూటలు వెళ్తుండడంతో ప్రభుత్వ పెద్దలు నోరుమెదపడంలేదన్న ఆరోపణలున్నాయి. 

2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.82 వేల నుంచి రూ.92 వేల మధ్య ఉండగా ఈ రెండేళ్లలో పెంచిన ధరల కారణంగా ప్రస్తుతం వెనామీ ఫీడ్‌ రూ.1.10 లక్షలు, టైగర్‌ ఫీడ్‌ రూ.1.23 లక్షలకు చేరింది. తాజాగా పెంపు (టన్ను రూ.15 వేలు) అమల్లోకి వస్తే వెనామీ ఫీడ్‌ రూ.1.25 లక్షలు, టైగర్‌ ఫీడ్‌ రూ.1.37 లక్షలకు చేరుతుంది. అంటే రెండేళ్లలో రైతులపై రూ.33 వేల నుంచి రూ.45 వేల మేర భారం పడినట్లవుతుంది. కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఫీడ్‌ కంపెనీలకు జీ హుజూర్‌ అంటూ వారి అడుగులకు మడుగులొత్తుతోంది. 

ఫీడ్‌ ధరల పెంపు విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు రైతులు సాగు సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ధరల పెంపును కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలను ఆక్వా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. 2019–24 మధ్యలో మూడుసార్లు కంపెనీలు పెంచిన ఫీడ్‌ ధరలను వెనక్కి తీసుకున్నాయి. అప్సడా చట్టం అమలుతో జగన్‌ ప్రభుత్వం టన్నుకు రూ.8,600 మేర భారం పడకుండా అడ్డుకుందని రైతులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement