‘స్థానిక’ ఎన్నికలపై టీడీపీ ఎత్తుగడ
చివరిదాకా సాగదీసి జనసేన, బీజేపీని కట్టడి చేసే వ్యూహం
టీడీపీ 80 శాతం సీట్లలో పోటీ చేస్తుందని ఇటీవల లోకేశ్ ప్రకటన
మర్నాడే ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ పట్టాన తేల్చకుండా టీడీపీ సాగదీత వైఖరి అనుసరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ల సర్దుబాటుకు ముందు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి స్థానికంగా ఎవరి బలం ఎంతో అంచనా వేద్దామని జనసేన, బీజేపీలకు టీడీపీ ప్రతిపాదించినట్లు నేతల మధ్య చర్చ సాగుతోంది. జనసేన, బీజేపీ ఎక్కువ సీట్లు కోరుతుండడంతో సీట్ల సర్దుబాటును రాష్ట్ర స్థాయిలో తేల్చేందుకు టీడీపీ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
సీట్ల కేటాయింపులో రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి ఎంత శాతం అన్నది ముందుగా తేల్చకుండా స్థానికంగా బలాబలాల మేరకు పోటీ చేద్దామని టీడీపీ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు జనసేన, బీజేపీలో చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలకు టీడీపీ సమాచారం ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. చివరిదాకా సాగదీసి జనసేన, బీజేపీని తక్కువ సీట్లకు పరిమితం చేయడం.. రిజర్వేషన్ల పేరుతో ఆయా పార్టీల సీట్లకు గండి కొట్టడం టీడీపీ వ్యూహమని స్పష్టం చేస్తున్నారు.
లోకేశ్ ప్రతిపాదనపై ఆదిలోనే వ్యతిరేకత..
అన్ని రకాల స్థానిక సంస్థల్లో జనసేన, బీజేపీకి కలిపి కేవలం 20 శాతం సీట్లు మాత్రమే కేటాయించాలన్నది టీడీపీ ఆలోచన అని నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది జూలై 16న టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. మూడు పార్టీల మధ్య 80–15–5 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని సమావేశంలో లోకేశ్ వెల్లడించారు. టీడీపీ 80 శాతం సీట్లలో, జనసేన 15 శాతం, బీజేపీ ఐదు శాతం సీట్లలో పోటీ చేస్తాయని, ఆ మేరకు సర్దుబాటు చేసుకుంటామని ప్రకటించారు. దీనిపై జనసేన నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ 24 గంటల వ్యవధిలోనే ప్రెస్‌మీట్ పెట్టి దీన్ని ఖండించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే రీతిన ముందుకు వెళతామనుకోవడం పొరపాటు అని తెనాలిలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించారు. అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 33 శాతం, బీజేపీకి పది శాతం మేరకు సీట్లు కేటాయించాలని రెండు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సహా పలుచోట్ల టీడీపీ, జనసేన నేతలు స్థానిక సంస్థల సీట్ల కోసం ఘర్షణ పడుతున్న పరిస్థితి నెలకొంది.
రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో నగర కార్పొరేషన్ మేయర్, జడ్పీ చైర్మన్లు మొదలు వార్డు సభ్యుడి పోటీ వరకు రిజర్వేషన్ల ఖరారు చుట్టూ ముడిపడి ఉంటుందని.. ఈ ప్రాతిపదికన ఎన్నికల వ్యూహాలే మారిపోతుంటాయనే చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు తారుమారు చేసి జనసేన, బీజేపీని పోటీకి దూరం చేసే ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా చోట్ల టీడీపీ పాగా వేసేందుకు సన్నద్ధం అవుతోందని పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కేటాయించిన కొద్ది సీట్లలోనూ పలుచోట్ల ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకే సీట్లు దక్కటాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు.


