సేవల స్థానంలో వ్యాపారమా? | India Post Book Post Gyan Post Postal Charges | Sakshi
Sakshi News home page

సేవల స్థానంలో వ్యాపారమా?

Aug 31 2026 2:25 PM | Updated on Aug 31 2026 2:25 PM

India Post Book Post Gyan Post Postal Charges

భారత తంతి తపాలకి ఘనమైన చరిత్ర ఉన్నది. పోస్ట్‌కార్డు, ఇన్‌లాండ్‌ కవరు, పోస్టల్‌ కవరు, రిజిస్టర్డ్‌ పోస్ట్‌ వంటి పలు సేవలు అందిస్తూ ఉన్నది. అతి తక్కువ చార్జీలకు పార్శిళ్ళు, దేశంలోని ప్రధాన పట్టణాలకి 24 గంటల్లో కవర్లు అందించే ‘స్పీడ్‌ పోస్ట్‌’ వ్యవస్థ కూడా అందుబాటులోకి తేవడంతో పోస్టాఫీసు లన్నీ రద్దీతో క్యూకట్టేవి. ఎంతోకాలంగా రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ‘సేవ’లు అందిస్తున్న డిపార్ట్‌మెంట్‌ గత సంవత్సరం ఏకంగా దాన్ని రద్దు చేసేసింది. కేవలం 20 గ్రాముల కవరుకు ఐదు రూపాయలు, రిజిస్టర్డ్‌ చార్జీలు   కలిపి 23 రూపాయ లుగా దేశం మొత్తం ఒకే విధానం ఉండేది.  అదనంగా ఉన్న ప్రతి 20 గ్రాము లకు మరో 5 రూపాయలు వసూలు చేసే విధానం ఉండేది.

అలాగే రచయితలు, ప్రచురణ కర్తలు ప్రచురించే సాహిత్య పుస్తకాలు ‘రిజిస్టర్డ్‌ ప్రింటెడ్‌ బుక్‌’, ‘రిజిస్టర్డ్‌ బుక్‌ పోస్ట్‌’ ద్వారా అతి తక్కువ ధరలో బట్వాడా చేసే సౌలభ్యం  ఉండేది.  కానీ గత ఏడాది రిజిస్టర్డ్‌ బుక్, రిజిస్టర్డ్‌ ప్రింటెడ్‌ బుక్, రిజిస్టర్డ్‌ లెటర్‌ అనేవి రద్దు చేసేసి రెండే రెండు విధానాలుగా... స్పీడ్‌ పోస్ట్, రిజిస్టర్డ్‌ పార్శిళ్ళను మాత్రమే ఉంచారు. కేవలం సుమారు రూ. 23 ఉండే రిజిస్టర్డ్‌ ప్రింటెడ్‌ బుక్, రిజిస్టర్డ్‌ బుక్‌పోస్ట్‌ తీసివేసి దాని స్థానంలో రిజిస్టర్డ్‌ పార్శిళ్లుగా 500 గ్రాముల లోపు రూ. 42; 1 కిలోకి రూ. 62గా పెంచారు.

ఆ తరువాత పుస్తకాల కోసం ‘జ్ఞాన్‌  పోస్ట్‌’ పేరుతో ఒక విధానాన్ని తీసు కొచ్చారు. 300 గ్రాముల నుంచి 20 కిలోల వరకు జీఎస్‌టీతో కలిపి రూ. 24గా నిర్ణయించారు. ఇది ఉపయోగించాలంటే వ్యాపారంకాని ఉచితంగా పంపే పుస్తకాలై ఉండాలి. 300 గ్రాములలోపు బరువుండే పుస్తకాలకు అనుమతి లేదు. ఇప్పుడు ఆగస్ట్‌ 1 నుంచి రిజిస్టర్డ్‌ పార్శిళ్ల ధరను కూడా పెంచారు. 500 గ్రాములలోపు ధర గతంలో రూ. 42గా ఉండేదాని స్థానంలో లోకల్‌ రూ. 34, సొంత రాష్ట్రంలో రూ. 77, మెట్రో రూ. 82, ఇతర రాష్ట్రాలకు రూ. 84గా పెంచారు. జ్ఞాన్‌  పోస్ట్‌ ధర రూ. 20 నుంచి రూ. 30కి పెంచారు.

ఒకప్పుడు ‘విద్యాసేవగా’ పరిగణించిన రిజిస్టర్డ్‌ ప్రింటెడ్‌ బుక్‌ సేవలకు ఇప్పుడు తిలోదకాలు ఇవ్వడం దేనికి సంకేతం? కేవలం రూ. 30 లేదా రూ.40 గల ఒక పుస్తకాన్ని పాఠకుడికి చేర్చాలంటే దాని ధర కంటే పోస్టల్‌ చార్జీలు అధి కంగా చెల్లించాల్సి రావడం చూస్తే... జ్ఞాన సంపదను ప్రజలకు చేర్చకుండా అడ్డుకట్ట వేయడం అనిపించడం లేదా? అందుకే ‘జ్ఞాన్‌  పోస్ట్‌’ ద్వారా అయినా పాఠకులకు తక్కువ ధరకు పంపే వెసులుబాటు కల్పించి, ఇప్పుడున్న 300 గ్రాముల విధానాన్ని, టారీఫ్‌ను సవరించితే రచయితలకు, ప్రచురణకర్తలకు మేలు జరుగుతుంది.
– చలపాక ప్రకాష్‌, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

ఇవి కూడా చదవండి: రేపటి పౌరులను ఇలాగేనా తీర్చిదిద్దేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement