‘కాక్రోచ్‌’ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?! | Sakshi Guest Column On Cockroach Janta Party ideology | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌’ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?!

Sep 1 2026 12:35 AM | Updated on Sep 1 2026 12:36 AM

Sakshi Guest Column On Cockroach Janta Party ideology

అభిప్రాయం

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు. అట్లా మారే ఆలోచన కూడా లేదని, సమాజాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడిని సృష్టించే ఉద్యమంగా మాత్రమే కొనసాగదలచుకున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ సిద్ధాంతాలు ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తూనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. సిద్ధాంతా లనేవి పార్టీలకు మాత్రమే ఉండాలా? సీజేపీ వంటి ఉద్యమాలకు ఉండవా? ఉండకూడదని, ఉండవని ఎవరైనా సూత్రీకరిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ మాట అనుకున్న తర్వాత రెండు ప్రశ్నలకు జవా బులు చెప్పుకోవాలి. ఒకటి, అసలు సిద్ధాంతాలు అంటే ఏమిటి? రెండు, ఆ ప్రకారం సీజేపీకి సిద్ధాంతాలు అనదగ్గవి ఉన్నాయా, ఉంటే ఏమిటవి? అదే విధంగా ఈ తరహా ప్రశ్నలు ఎదురైనప్పుడు సీజేపీ నిర్వాహకులు ఇస్తున్న సమాధాన మేమిటి? సిద్ధాంతం అనే మాటకు స్థూలమైన నిర్వచనం ఏమంటే ఒక వ్యక్తికి, లేదా పార్టీకి, లేదా సంస్థకు సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, అందుకు పరిష్కారాల పట్ల, భవిష్యత్తు పట్ల, దాని కోసం ఏమి చేయాలనే విషయమై తనదైన అవగాహన, కార్యాచరణ మార్గం ఉండటం. సిద్ధాంతం అనేది ఏ రంగం విషయంలోనైనా ఉంటుంది. ఇక్కడ సందర్భం సీజేపీ అయినందున సామాజిక రంగం గురించి చెప్పుకుంటున్నాము. సిద్ధాంతాలన్నవి రాజకీయ పార్టీలకే పరిమితం కానక్కర లేదని, సంస్థలకు కూడా ఉండవచ్చు నని, ఉండాలి కూడానని అనుకుంటున్నాము గనుక, ఇపుడు సీజేపీ గురించి విచారిద్దాము.

ప్రకటన, పత్రం కనిపించని పోరాటం
కొద్దిరోజుల క్రితం ఒక ఛానల్‌ ఇంటర్వ్యూలో సీజేపీ నిర్వాహకులు ఈ ప్రశ్నకు స్వయంగా చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది. ప్రశ్న: మీ సిద్ధాంతం మితవాదమా, మధ్యే మార్గమా, లేక వామపక్షమా? జవాబు: మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని మొదటి నుంచి చెబుతున్నాం. ప్రశ్న: రాజ్యాంగానిది మధ్యే మార్గమంటారు కదా? జవాబు: ఏదైనా కావచ్చు. కానీ మాది రాజ్యాంగ మార్గం. సమానత్వ హక్కులు, భావప్రకటనా స్వాతంత్య్రం, విద్యాహక్కులు, శాంతియుతంగా నిరసన ప్రకటించే హక్కు వగైరాలు. ఇటువంటివి అనేకం రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని సరిగా పాటించినట్లయితే మన దేశం చాలా ముందుకు పోతుంది. మేము సెక్యులర్‌. మావి ప్రజాస్వామిక విలువలు. ఛానల్‌ చర్చ ఒకే ప్రశ్నతో క్లుప్తంగా ముగిసినందున సీజేపీ ఆలోచనలు పూర్తి రూపంలో వెల్లడి కాలేదనాలి. ఇతరత్రా కూడా వారు దీనిపై ఒక ప్రకటనగాని, పత్రంగానీ విడుదల చేయలేదు. సంస్థ ఆరంభమైన మొదటి రోజు నుంచే వారు కార్యక్రమాలలో తలమునకలుగా ఉండటం అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఉద్యమం వేడిలో నిర్వాహకులు చెప్పే కొద్ది మాటలు, చేసే కొద్ది కార్యక్రమాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. 

ముందుకు సాగిన కొద్దీ, ఇతర సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టగలమంటున్నందున వాటి గురించి కూడా పలు ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల సీజేపీ, రాగల రోజులలో ఈ ప్రశ్నలపై దృష్టి పెట్టడం అవసరం అవుతుంది. సంస్థ నాయకుల నుంచి ఇంతవరకు వినవచ్చిన మాటలను, వారి కార్యక్రమాలను గమనించినపుడు వారి ఆలోచనలు, లేదా స్థూలమైన రీతిలో సిద్ధాంతాలు అనదగ్గ వాటిపై కొన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు, కన్వీనర్‌ అయిన అభిజీత్‌ దీప్కే అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయం నుంచే భారత రాజ్యాంగాన్ని పైకెత్తి చూపటం చేశారు. జంతర్‌ మంతర్‌ ఆందోళన పొడవునా తనతోపాటు పలువురు ఇతర ఆందోళనకారులు అదే పని చేశారు. ఇదే ధోరణి ఇతర రాష్ట్రాలలోనూ కనిపించింది. ఈ స్ఫూర్తి ఎంతగా వ్యాపించిందంటే, ఇటీవల పట్నాలో పోలీసులు అదుపు లోకి తీసుకున్న ఆరేళ్ల పేద పిల్లవాడు ఆదిత్య రాజ్యాంగం గురించి, అంబేడ్కర్‌ గురించి మాట్లాడటం విన్నాము.

రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న ఆందోళనలు
మొదటి రోజు నుంచే అభిజీత్‌ అనేకమార్లు గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, భగత్‌సింగ్‌ల ప్రస్తావనలు, కొద్దిసార్లు సుభాష్‌ బోస్‌ ప్రస్తా వన చేస్తున్నారు. వారి మార్గాన్ని అనుసరిస్తామన్నారు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాలిచ్చారు. రైతాంగానికి సంఘీభావం ప్రకటించి వారిని తమకు మద్దతు తెలుపవలసిందిగా ఆహ్వానించటంతో పాటు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి కలిగే నష్టాలపై వారు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రతినిధులను పంపారు. సీజేపీ మొదటినుంచే లేవనెత్తిన అంశాలలో మత రాజకీయాల పట్ల కూడా నిరసనలు కనిపించాయి.  ఇపుడు పైన ప్రస్తావించిన ఛానల్‌ ఇంటర్వ్యూలోనూ అభిజీత్‌ తాము సెక్యులర్‌ వాదులమని ప్రకటించారు. ఈ అంశాలకే పరిమితం కాని నిర్వాహకులు పలు ప్రజాస్వామ్య సంబంధమైన సమస్యలను కూడా లేవనెత్తారు. అవి కోర్టులు, ఎన్నికల సంఘం సవ్యంగా పనిచేయక పోవటం, పార్టీ ఫిరాయింపులు, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలకు జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవటం, ప్రశ్నిస్తే ముద్రలు వేసి అణచివేయటం, అవినీతి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ధనిక– పేద తారతమ్యాలు మొదలైనవి అందులో ఉన్నాయి. ఈ ఉద్యమ వాతావరణం క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది.

శూన్యాన్ని పూరించే శక్తి కాగలదా?  
ఇవన్నీ గమనించినపుడు సీజేపీది ఏ సిద్ధాంతమని భావించ వలసి ఉంటుంది? మితవాదమా, మధ్యేవాదమా, వామపక్ష వాదమా, లేక అసలు ఏ వాదమూ లేనిదనా? వారు తమది రాజ్యాంగ వాదమన్నారనుకోవాలి. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయాలు రెండు న్నాయి. సీజేపీ నాయకులను ప్రశ్నించిన ఛానల్‌ యాంకర్‌ అన్నట్లు భారత రాజ్యాంగం మధ్యేమార్గానిది ఎంతమాత్రం కాదు. అంబేడ్కర్, నెహ్రూలు సారథ్యం వహించిన ఆ గ్రంథం సోషలిస్టు, లేదా వామపక్షపు మొగ్గు గల మధ్యేమార్గ లక్షణాలు కలది. ఇపుడు సీజేపీ నిర్వాహకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ అవే లక్షణాలతో ఉన్నాయి. ఇది మొదటి విషయం కాగా, స్వాతంత్య్రా నంతరం అందుకు వారసత్వం తీసు కున్నామన్న కాంగ్రెస్‌ ఆచరణలో విఫలమైంది. ఆ పార్టీ స్థానంలో అదే వారసత్వాన్ని కొనసాగిస్తామన్న జనతా పార్టీ, నేషనల్‌ ఫ్రంట్, యునైటెడ్‌ ఫ్రంట్‌లు కూడా విఫలమయ్యాయి. ఆ శూన్యంలోకి బీజేపీ అనే మితవాద పార్టీ ప్రవేశించింది. ప్రస్తుతం అది కూడా ప్రజాదరణను క్రమంగా కోల్పోతున్నది. భారతదేశపు వర్తమాన సమాజం ప్రగతిశీలమైన సమ్మిళిత వ్యవస్థను కోరుతోంది. అదే ఆ సమాజపు అవసరం, సహజ స్వభావం. అటువంటి స్థితిలో దేశం ఎదుర్కొంటున్న శూన్యాల మధ్య, సీజేపీ వంటిది ఆ శూన్యాన్ని పూరించగల శక్తిగా ఎదగగలదా, ఎదిగితే బాగుండుననే ఆలోచనలు ఒక చిన్న స్థాయిలో మొదలవుతున్నాయి.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement