పూర్తి ఆరోగ్యంతో ఉన్నా!  | Bahujan Samaj Party chief Mayawati dismisses health rumors | Sakshi
Sakshi News home page

పూర్తి ఆరోగ్యంతో ఉన్నా! 

Sep 14 2026 6:20 AM | Updated on Sep 14 2026 6:20 AM

Bahujan Samaj Party chief Mayawati dismisses health rumors

నా ఆరోగ్యంపై వస్తున్నవన్నీ వదంతులే 

మామ కనుసన్నల్లోనే ఆకాశ్‌ ఆనంద్‌ 

ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి 

సాక్షి, న్యూఢిల్లీ: తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె యూపీ రాజధాని లక్నోలో మీడియాతో మాట్లాడారు. వదంతులను నమ్మవద్దని, రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నుంచి తాజాగా మూడోసారి బహిష్కృతుడైన ఆకాశ్‌ ఆనంద్‌పై ఆమె మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేసేందుకు అతడు ప్రయతి్నస్తున్నాడని ఆరోపించారు. సొంత ఆలోచనలతో కాకుండా మామ, మాజీ ఎంపీ అశోక్‌ సిద్ధార్థ్‌ కనుసన్నల్లోనే అతడు నడుస్తున్నాడని విమర్శించారు. ‘శనివారం నా నివాసంలో ఉన్న పార్టీ ఇంఛార్జ్‌ అలోక్‌ కుమార్‌కు ఆకాశ్‌ ఆనంద్‌ ఫోన్‌ చేశాడు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సైతం బెహెన్‌జీ(మాయావతి) ఎక్స్‌ ద్వారానే ప్రకటిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగోలేదా అంటూ అలోక్‌ను అడిగాడు. 

తాను ఫోన్‌ చేసిన విషయాన్ని నాకు చెప్పవద్దని కూడా అలోక్‌ కుమార్‌ను కోరాడు. ఆకాశ్‌ ఫోన్‌ చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశమున్నప్పటికీ అతడు సొంతంగా ఏమీ చేయడం లేదు, మామ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు నేరుగా వాస్తవాలు వివరించాల్సిన అవసరముంది. కాబట్టే ఈ ప్రకటన చేస్తున్నా’అని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇటీవల తీసుకున్న కఠిన నిర్ణయాలు బీఎస్పీకి మేలు చేశాయని ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు ఆనంద్‌ కుమార్‌ కుమారులు ఆకాశ్‌ ఆనంద్, ఇషాన్‌ ఆనంద్‌లకు బీఎస్‌పీలో ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని ఆమె ప్రకటించారు. 

వారసురాలిగా దీపికా ఆనంద్‌! 
సోదరుడు ఆనంద్‌ కుమార్తె దీపికా ఆనంద్‌ విషయం ఇటీవల మాయావతి ప్రస్తావించా రు. బీఎస్‌పీకి సంబంధించిన అంశాల్లో ఆమె తండ్రికి సాయంగా ఉండవచ్చని అన్నారు. ముందుకు వస్తే ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలను కూడా అప్పగిస్తామని ప్రకటించారు. ఆమె సిద్ధంగా లేకుంటే దళిత వర్గానికి చెందిన సాధారణ కార్యకర్తకు ఆ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశాయి. కాగా, లా చదువుతున్న దీపికా ఆనంద్‌ ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement