శాకాహారం మంట!  | Rahul Gandhi dig amid BRICS menu row | Sakshi
Sakshi News home page

శాకాహారం మంట! 

Sep 14 2026 6:15 AM | Updated on Sep 14 2026 6:15 AM

Rahul Gandhi dig amid BRICS menu row

బ్రిక్స్‌ గాలా డిన్నర్‌లో శాకాహార భోజనంపై రాహుల్‌ అసహనం 

80% మంది భారతీయులు మాంసాహారులేనని వెల్లడి 

శాకాహారాన్ని బీజేపీ బలవంతంగా తినిపిస్తోందని ఆగ్రహం

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ దేశాధినేతలతోపాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో దౌత్యాధికారులకు ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన విందులో కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. అత్యధికశాతం భారతీయులు మాంసాహారులని తెల్సి కూడా మోదీ సర్కార్‌ కేవలం శాకాహారం వడ్డించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. 

ఈమేరకు రాహుల్‌ ఆదివారం ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘గణాంకాలను మీకు గుర్తుచేస్తున్నా. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. మరీ ముఖ్యంగా భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. నా చెల్లి చేసిన శాకాహార చిరుతిండి ఛోలే భటూరేలా మాంసాహారం ఎంతో పసందుగా ఉంటుంది. అలాంటప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్‌ సంబంధిత విందులో మాంసాహారాన్ని విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’అని రాహుల్‌ మోదీ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. పోస్ట్‌తోపాటు తన సోదరి చేసిన చిరుతిండి ఫొటోను పోస్ట్‌చేశారు.  

నచ్చిన ఆహారం వడ్డించరా?: కాంగ్రెస్‌ 
భారత్‌తోపాటు విదేశాల్లోనూ మాంసాహార ప్రియులే అత్యధికమని, అలాంటి బ్రిక్స్‌ దేశాల నుంచి వచ్చిన విదేశీ అతిథులకు శాకాహారం బలవంతంగా వడ్డించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్‌ పార్టీ మోదీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ‘‘బ్రిక్స్‌ సదస్సు ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచదేశాల అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి విందు ఆరగించారు. వీళ్లు ఏ ఆహారం తినాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా?

 ఇప్పటికే భారతీయులు ఏం తినాలో బీజేపీ ఆదేశిస్తోంది. ఇక విదేశీయులకు శాకాహారాన్ని బలవంతంగా తినిపించడం ఎంతవరకు సబబు?’’అని కాంగ్రెస్‌ మీడియా విభాగ చీఫ్‌ పవన్‌ ఖేడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చవులూరించే ఎంతో మాంసాహార వంటకాలకు భారత్‌ పెట్టిందిపేరు. వాటిని విదేశీ అతిథులు రుచి చూడకుండా చేసి భారతీయ ఆహార సంప్రదాయాలను దాచాలని చూస్తారా?’’అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ విందు మెనూను పోస్ట్‌చేసింది. 

సక్సెస్‌ను కాంగ్రెస్‌ సహించట్లేదు: బీజేపీ 
సదస్సు విజయవంతంకావడంతో కాంగ్రెస్‌ సహించట్లేదని, అందుకే అర్థంపర్థంలేకుండా ఆహారం గురించి విమర్శలుచేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ అన్నారు. ‘‘సదస్సు గురించి వంకలుపెట్టడానికి ఏమీ లేదు. డిక్లరేషన్‌లో ఏకాభిప్రాయం సాధించి మోదీ సర్కార్‌ తన దక్షతను చాటింది. సదస్సు ఇలా విజయవంతంకావడం కాంగ్రెస్‌ సహించలేకపోతోంది. అందుకే విమర్శించడానికి మరే విషయాలు లేక చివరకు ఆహారం గురించి విమర్శలు చేస్తోంది’’అని భండారీ అన్నారు. ‘‘డిక్లరేషన్‌తో విజయం సాధించిన మోదీని రాహుల్‌ అభినందించాల్సిందిపోయి ఈ శాకాహారం, మాంసాహారం గోల ఏంటి?’’అని మరో బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్‌ సిన్హా వ్యాఖ్యానించారు.  

కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన మెనూ (అన్నీ శాకాహారాలే) స్టార్టర్స్‌.. 
1. ఖండ్వీ మిలే–ఫియులే(శనగపిండితో ఆవిరిపై ఉడికించి పలుచగా చేసిన రోల్స్‌) 
2. మష్రూమ్‌ కబాబ్‌లు, షీర్మాల్‌ రొట్టెతో కలిపి ఖుంబ్‌ గలౌతీ 

మెయిన్‌ కోర్స్‌ 
1. పనీర్‌ లబాబ్దార్‌ 
2. హిమాలయాల్లో లభించే అరుదైన మోరెల్‌ మష్రూమ్‌లు, ఆస్పరాగస్, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష, బాదంతో చేసిన గుచ్చీ మారి్మక్‌ 
3. క్యారెట్, గ్రీన్‌ బీన్స్‌ కూర 
4. కందిపప్పు, టమాటాలతో చేసిన
కర్ణాటక తక్కలి బెల్లే చారు 
5. చిరు ధాన్యాల పులావ్‌
6. బీట్‌రూట్‌ రైతా 
7. వివిధ రకాల భారతీయ బ్రెడ్‌లు 

తీపి పదార్థాలు
1. పాత ఢిల్లీ ఫ్రూట్‌ క్రీమ్‌ 
2. జిలేబీ 
3. పాలు, బియ్యం, మల్బెర్రీ పండ్లు కలిపిన షాహ్‌తూత్‌ పాయసం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement