న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖ రాగ్ర సదస్సును ఫలప్రదంగా, ఫలితాల ఆధారితంగా మార్చినందుకు కూటమిలోని సభ్య దేశాల అధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రతిబింబించే ఒక వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదస్సు విజయవంతమైందని హర్షం వ్యక్తంచేశారు.శిఖరాగ్ర సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని కూడా ఇందులో చేర్చారు. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ అన్ని రంగాల్లోనూ స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించుకుందని ఆయన పేర్కొన్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ముగించుకొని తమ స్వదేశానికి పయనమయ్యారు. జిన్‌పింగ్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజలపాటు తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే పుతిన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.


