ముంబై: మహారాష్ట్రలోని యవత్మాల్‌లో జాతర వేళ ఘోర ప్రమాదం జరిగింది. ఫెరిస్ వీల్‌లో జుట్టు చిక్కుకోవడంతో బాలీ మారోతి తాలికోటే (25) అనే యువతి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలపై చర్మంలో కొంత భాగం పూర్తిగా ఊడిపోయింది. యవత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకాలో తంహా పోలా పండుగ సందర్భంగా ఒకరోజు జాతర నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు పునేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వచ్చారు.
ఫుల్సావంగి గ్రామానికి చెందిన బాలీ మారోతి తాలికోటే జాతరకు వచ్చి ఫెరిస్ వీల్ ఎక్కారు. అది వేగంగా తిరుగుతున్న సమయంలో ఆమె జుట్టు సీటు వెనుక ఉన్న తిరిగే బేరింగ్‌లో చిక్కుకుంది. ఫెరిస్ వీల్ వేగంగా తిరుగుతుండటంతో ఆమె జుట్టు ఒక్కసారిగా బలంగా లాగినట్లయింది. దీంతో తలపై చర్మంలో పెద్ద భాగం ఊడిపోయింది. తీవ్ర నొప్పితో ఆమె కేకలు వేయడంతో అక్కడున్న వారు గమనించారు. రక్తంతో ఉన్న ఆమెను చూసి జాతరలో భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న సహాయ పోలీసు ఇన్‌స్పెక్టర్ సునీల్ అంబురే, పోలీసు కానిస్టేబుల్ సుహాస్ కాయ్టే అక్కడికి చేరుకున్నారు. వేగంగా తిరుగుతున్న ఫెరిస్ వీల్‌ను స్థానికుల సహాయంతో నిలిపివేశారు. అనంతరం బాధిత యువతిని సురక్షితంగా ఫెరిస్ వీల్ నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.


