చండీగఢ్: పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధు నివాసంపైకి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పంజాబ్‌లోని బర్నాలాలో ఉన్న ఆయన ఇంటి వద్దకు అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో బైక్‌లపై ముసుగు ధరించిన వచ్చిన ముగ్గురు వ్యక్తులు మెయిన్ గేటుపైకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. సిద్ధు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారని, కాల్పుల సమయంలో ఆయన తల్లిదండ్రులు, భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారన్నారు.
కాల్పులతో ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని వివరించారు. అనంతరం, ఈ కాల్పులకు తమదే బాధ్యతంటూ గ్యాంగ్‌స్టర్ డోని బాల్ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. తమ ఫోన్ కాల్స్‌కు అతడు స్పందించనందునే, అతడి ఇంటి డోర్‌బెల్‌ను తుపాకీ కాల్పులతో మోగించామంటూ వ్యాఖ్యానించాడు. హత్యకు గురైన గాయకుడు సిద్ధూ మూసేవాలాకు గులాబ్ సిద్ధూ సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం.


