తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ ఏర్పాటు చేయబోయే సెక్యులర్ కూటమికి దూరంగా ఉంటామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. 120 రోజుల విజయ్ పాలనపై తీవ్ర విమర్శలకు సిద్ధపడినట్లు బహిరంగంగా ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ డీఎంకేకు లాభం చేకూర్చే నిర్ణయాలేనని, ప్రతిపక్షానికి మళ్లీ అవి దగ్గరవుతున్నాయా? అనే చర్చా జోరందుకుంది.
తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సెప్టెంబర్ 15న అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే నేతృత్వంలోని కూటమితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. వామపక్షాల తాజా నిర్ణయంతో పోరు ఐదు కోణాల్లో సాగనుంది.
అయితే ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో బయటి నుంచే సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు.. ఉప ఎన్నికల వేళ మాత్రం అదే ప్రభుత్వ అభ్యర్థులకు ఎదురుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం డీఎంకేకు లాభం చేకూర్చేందుకు కాదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి.
టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమిలో మేం చేరబోం. మూడు ప్రధాన కూటములకూ వ్యతిరేకంగా మేం పోటీ చేస్తున్నాం. అంతే తప్పా ఏ పార్టీకో లాభం చేకూర్చేందుకు మేం పోటీ చేయడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తేల్చిచెప్పారు.
బయట మద్దతు.. లోపల విమర్శలు
2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెజార్టీకి కొంత దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటించాయి. ప్రజల తీర్పును గౌరవించడం, గవర్నర్ పాలనకు అవకాశం లేకుండా చూడటం, పరోక్షంగా బీజేపీ పాలన రాకుండా అడ్డుకోవడమే తమ మద్దతు ఉద్దేశమని అప్పట్లో వామపక్షాలు తెలిపాయి. అయితే కేబినెట్‌లో మాత్రం చేరలేదు. అలాగే టీవీకే అధికారిక కూటమిలోనూ భాగం కాలేదు.
ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం టీవీకే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘ప్రభుత్వానికి మద్దతు.. అభ్యర్థులకు వ్యతిరేకం’ అనే వామపక్షాల వైఖరి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఉప ఎన్నికలు ప్రభుత్వం మార్పు కోసం జరిగేవి కావని షణ్ముగం స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం తమ రాజకీయ నిర్ణయమని తెలిపారు.
120 రోజుల పాలనపై ప్రచారంలోనే కౌంటర్
ఉప ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసుకుంటామని సీపీఎం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ తొలి 120 రోజుల పాలన, ఆర్థిక విధానాలు, పరిపాలనా చర్యలు, అసెంబ్లీ పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తామని షణ్ముగం చెప్పారు. ముఖ్యంగా ‘నియో లిబరల్’ ఆర్థిక విధానాలపై తమ అభ్యంతరాలను ప్రచారంలో ప్రస్తావిస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత ఉండాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.
సచివాలయం విషయంలోనూ విభేదాలు
చెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, ట్రాఫిక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరాయి. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్‌పై విజయ్ చేసిన వ్యాఖ్యలు, చేతి సైగలపైనా సీపీఎం గతంలో తీవ్రంగా స్పందించింది. సభను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చొద్దని షణ్ముగం సూచించారు.
‘ఇది ప్రజలపై రుద్దిన ఎన్నిక’
మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా వామపక్షాలు టీవీకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామలు ఆ తర్వాత రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
ఎన్నికైన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని సీపీఎం విమర్శించింది. ఈ పరిణామాల వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని.. ఇవి సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, ప్రజలపై రుద్దిన ఎన్నికలని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.
రెండు సీట్లలో గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చన్నది వామపక్షాల లెక్క. అందుకే ప్రభుత్వం విషయంలో విజయ్‌కు మద్దతు కొనసాగిస్తూనే.. ఎన్నికల విషయంలో మాత్రం టీవీకేను ఢీకొట్టాలని నిర్ణయించాయి. అంటే.. ప్రభుత్వం నిలబడేందుకు దోస్తీ.. తమ రాజకీయ బలం చాటుకునేందుకు కుస్తీ! ఇదే ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ అనుసరిస్తున్న ‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’ అనే ప్రశ్నకు అసలు సమాధానం.
ఇదీ చదవండి: బిహార్‌లో బీజేపీకి ఝలక్


