చిన్న కుటుంబంతోనే సంతోషకరమైన జీవనం | - | Sakshi
Sakshi News home page

చిన్న కుటుంబంతోనే సంతోషకరమైన జీవనం

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

కాశిబుగ్గ: చిన్న కుటుంబంతోనే సంతోషకరమైన జీవనం కొనసాగించవచ్చని జిల్లా ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రకాశ్‌ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వరంగల్‌లోని ఉర్సు, సీకేఎం ఆస్పత్రుల్లో గురువారం పురుషుల కుటుంబ నియంత్రణ శాశ్వత శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎస్‌వీ అనేది సురక్షితమైన, సులభమైన, ప్రతిభావంతమైన శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అని పేర్కొన్నారు. ప్రత్యేక శిబిరంలో 21 మంది పురుషులకు ఎన్‌ఎస్‌వీ శస్త్రచికిత్సలను డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ కృష్ణారావు నిర్వహించినట్లు ఆయన వివరించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సాజిదాబేగం, వైద్యాధికారి ఎం.శ్రవణ్‌కుమార్‌, డాక్టర్‌ ప్రతీక్‌, స్టాటిస్టికల్‌ అధికారి ప్రసన్నకుమార్‌, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ వెల్ఫేర్‌ వర్కర్‌ మసూద్‌ అలీ, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ పాల్గొన్నారు.

అవమానంతో

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

దుగ్గొండి: అవమానంతో ఒకరు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దోర్నాల రమేశ్‌ నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తికి కొంత బాకీ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సదరు వ్యక్తికి చెందిన కిరాయి మనుషులు దుగ్గొండికి వచ్చి రమేశ్‌ ఇంటిలోని సామగ్రి అంతా బయట పడేసి దౌర్జన్యం చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడ తనకు న్యాయం జరగదని నిర్ధారించుకుని అవమాన భారంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి రమేశ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. వాహన పైలట్‌ అజీజ్‌పాషా, ఈఎంటీ కోర్కెల నర్సింగరావు వాహనంలోనే ప్రథమ చికిత్స చేస్తూ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సైరావుల రణధీర్‌రెడ్డిని వివరణ కోరగా ఇద్దరు వేర్వేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఈ మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్‌

పర్వతగిరి: గంజాయి తరలిస్తున్న యువకుడిని అరెస్ట్‌ చేసి, అతడి నుంచి 9 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామంలో గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన సయ్యద్‌ ఖాజా బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 9 కిలోల ఎండు గంజాయి లభించింది. ఏపీలోని చిత్తూరు నుంచి గంజాయి కొనుగోలు చేసి గ్రామంలో విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రెండేళ్ల క్రితం సోమారం గ్రామంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement