కోనేరు కృష్ణకు ఆర్నెల్ల జైలు | Koneru Krishna sentenced to six months in prison | Sakshi
Sakshi News home page

కోనేరు కృష్ణకు ఆర్నెల్ల జైలు

Jul 17 2026 4:11 AM | Updated on Jul 17 2026 4:11 AM

Koneru Krishna sentenced to six months in prison

వివరాలు వెల్లడిస్తున్న పీపీ రమణారెడ్డి, కాగజ్‌నగర్‌ డీఎస్పీ

మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ సహా మరో ఏడుగురికీ జైలు, జరిమానా 

అటవీ అధికారులపై దాడి ఘటనలో తీర్పు

ఆదిలాబాద్‌టౌన్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అటవీశాఖ అధికారులపై దాడి కేసులో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణతోపాటు మరో ఏడుగురికి ఆర్నెల్ల జైలు, జరిమానా విధిస్తూ ఆదిలాబాద్‌ స్పెషల్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి డేనిరుత్‌ గురువారం తీర్పునిచ్చారు. పీపీ రమణారెడ్డి, లైజన్‌ అధికారి ఈశ్వర్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 జూన్‌ 30న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాల గ్రామ శివారులోని కడంబా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. మూడు ట్రాక్టర్లతో భూమి చదును చేస్తుండగా కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని జీపులో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా కోనేరు కృష్ణ, బారు పోచం, పొట్టె మల్లేష్, బిచ్చర శంకర్, మరికొంతమంది అడ్డగించారు. 

ట్రాక్టర్లను ధ్వంసం చేస్తుండగా ఎఫ్‌ఆర్‌వో చీలే అనిత ట్రాక్టర్‌పైకి ఎక్కి ఎవరినీ కొట్టొ ద్దని సూచించారు. కోనేరు కృష్ణ వెదురు కర్రలతో ఆమెను కొట్టడంతో చేతులకు గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు రమాదేవి, పడాల ఝాన్సీ, లక్ష్మి, బోంపల్లి అనిత, ఆత్రం లక్ష్మిలను కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు 39 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేయగా, కేసు విచారణలో ఉండగా ఇద్దరు మృతిచెందారు. నేరం రుజువు కావడంతో 8 మందికి వివిధ కేసుల్లో ఆరు నెలల శిక్ష, ఒక్కొక్కరికి రూ.8,500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. శిక్ష పడిన వారిలో కోనేరు కృష్ణ, బూరం పోశం, పుల్ల శ్రీకాంత్, కొట్ట మల్లేష్, బిబ్బర శంకర్, రాజశేఖర్, బూరం మల్లేష్, బూరం శ్యామల ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement