పోయినోళ్లకు పింఛన్లు! | - | Sakshi
Sakshi News home page

పోయినోళ్లకు పింఛన్లు!

Jul 17 2026 3:40 AM | Updated on Jul 17 2026 3:40 AM

● 234 మంది ఖాతాల్లో డబ్బులు జమ ● లభించని మరో 1,212మంది ఆచూకీ ● సొమ్ము చేసుకుంటున్న బంధువులు ● బల్దియాలో ఎఫ్‌ఆర్‌ఏ సర్వేతో వెల్లడి

కైలాస్‌నగర్‌: మరణించిన వారి పేరిట ఇంకా పెన్షన్లు వస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతి చెంది ఏళ్లు గడుస్తున్నా వారి బ్యాంక్‌ ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము ప్రతీనెల జమవుతూనే వస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 234 మంది చనిపోయినోళ్ల ఖాతాల్లో పెన్షన్‌ డబ్బులు పడుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతోంది. చేయూత పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టాల నే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫేషియల్‌ రికగ్నిషన్‌ అథెంటిఫికేషన్‌ (ఎఫ్‌ఆర్‌ఏ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 14,133 మంది లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతుండగా వారు జీవించి ఉన్నారా? అనే దాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టింది. మెప్మా ఆర్పీలు, మున్సిపల్‌ వార్డు ఆఫీసర్ల ద్వారా ప్రత్యేక లాగిన్‌ కేటాయించి క్షేత్రస్థాయిలో వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. అయితే, 234 మంది మృతి చెందినప్పటికీ వారికి చెల్లించే పెన్షన్‌ మాత్రం నిలిచిపోలేదు. గత కొన్నేళ్లుగా రెగ్యులర్‌గా వారి ఖాతాల్లో పింఛన్‌ డబ్బులు జమ అవుతునే ఉన్నాయి. మృతులకు డెత్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న మున్సిపల్‌ యంత్రాంగం పెన్షన్లు నిలిపివేసేలా దృష్టి సారించకపోవడం గమనార్హం.

లభించని 1,212 మంది ఆచూకీ

క్షేత్రస్థాయి సర్వే ఇటీవల ముగియగా 1,212 మంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదని అధికారులు చె బుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. వారి ఫోన్‌ నంబర్లు పనిచేయకపోగా, ఇంటి అడ్రస్‌లు కూడా మారినట్లు చెబుతున్నారు. కొన్ని సెల్‌ నంబర్లు పని చేసినప్పటికీ తాము పెన్షన్‌ లబ్ధిదారులం కాదంటూ దాటవేత వైఖరిని అవలంభిస్తున్నారు. అయితే, వా రి ఖాతాల్లో మాత్రం పెన్షన్లు జమవుతూనే ఉండటం గమనార్హం. కాగా, 655 మంది రాష్ట్రంలో పెన్షన్‌ పొందుతూ మహారాష్ట్ర, రాజస్థాన్‌, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో నివసిస్తున్నట్లు డీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి కోసం వచ్చిన సమయంలో పెన్షన్‌ తీసుకుని తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లగా వారి పెన్షన్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, మరో 47మందికి సంబంధించి ఆధార్‌ వివరాలు తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. మరో నలుగు రు పెన్షన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపనట్లు చెబు తున్నారు. ఇలాంటి వారిలో అత్యధికులు అనర్హులే ఉండే అవకాశమున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఎవరైనా నిజమైన లబ్ధిదారు ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెన్ష న్లు నిలిపివేయడం లేదని చెబుతుండటం గమనా ర్హం. మరింత లోతుగా, పారదర్శకంగా సర్వే నిర్వహిస్తే మరింత మంది అనర్హులు బయటపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా మున్సిపల్‌, డీ ఆర్డీఏ, మెప్మా శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏటీఎం, యూపీఐల ద్వారా డ్రా

మృతి చెందిన పెన్షన్‌దారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమవుతున్న పెన్షన్‌ సొమ్మును వారి కుటుంబీకులు అక్రమంగా డ్రా చేసుకుంటున్నట్లు సర్వేలో గుర్తించారు. లబ్ధిదారుల పేరిట ఉన్న ఏటీఎంలు, ఫోన్‌ పే, గూగుల్‌ పే లాంటి యూపీఐల ద్వారా నగదును విత్‌ డ్రా చేసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఇలా, పలువురు లబ్ధిదారుల ఖాతాలను అధికారులు పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది.

అనర్హులకు అందకుండా చూస్తాం

బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు జీవించే ఉన్నారా? అనేదాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్‌ సర్వేకు ఆదేశించింది. రెండు నెలలుగా పట్టణంలో సర్వే నిర్వహించాం. 234 మంది మృతి చెందినట్లు గుర్తించాం. ఈ నెల నుంచి వారి పెన్షన్‌ నిలిపివేస్తాం. చిరునామా లభించని వారిలో ఎవరైనా అర్హులుంటే డీఆర్‌డీఏ, మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించి వివరాలు అందజేయాలి.

– జాదవ్‌ శేష్‌రావు, డీపీఎం పెన్షన్స్‌, డీఆర్‌డీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement