నేడు కేబినెట్‌ భేటీ | Telangana Cabinet to Meet at Secretariat on July 17 | Sakshi
Sakshi News home page

నేడు కేబినెట్‌ భేటీ

Jul 17 2026 5:42 AM | Updated on Jul 17 2026 5:42 AM

Telangana Cabinet to Meet at Secretariat on July 17

ప్రాజెక్టులే ప్రధాన ఎజెండా

మెట్రో రైలుపైనా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనా విలువలకు సంబంధించి ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమాచారం. గత కేబినెట్‌ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవరించిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారుల స్థాయిలోనే ఆగిపోతున్నాయని, కేబినెట్‌ ముందుకు రావడం లేదని చెప్పారు. దీంతో సీఎం కల్పించుకుని వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చిద్దామని చెప్పారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు ప్యాకేజీలతోపాటు నిర్మాణంలో ఉన్న పలు ఇతర   ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలిసింది. మెట్రో రైలు అంశం ముందుకు సాగకుండా అలా నిలిచిపోవడంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం.. ఎస్‌బీఐ కాప్స్‌కు మొదటి దశ ఆస్తుల విలువ మదింపు, ఎల్‌ అండ్‌ టీ నుంచి టేకోవర్‌ చేయడం, రెండో దశకు అయ్యే వ్యయ అంచనాలు, అలాగే రుణాలు తక్కువ వడ్డీకి తీసుకునే అంశంలో నివేదిక ఇవ్వాల్సి ఉంది.

ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ను నియమించినా, కేంద్రం ఇంకా తన ప్రతినిధిని ప్రకటించకపోవడం, కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.  

వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్‌పై చర్చ 
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రిజర్వాయర్లు అడుగంటిన నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్‌ను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. బుల్లెట్‌ ట్రైన్‌కు అవసరమైన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నందున అందుకు అయ్యే వ్యయం, భూ సేకరణ అంశాలను కూడా చర్చించవచ్చని తెలిసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం, సుప్రీంకోర్టు నోటీసుల తరువాత అనుసరించాల్సి వ్యూహంపై చర్చించవచ్చని సమాచారం. అలాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్న చర్చించే అవకాశం ఉందంటున్నారు.  

పీఆర్‌ చట్ట సవరణకు ఆమోదం! 
గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 70(3)కు సవరణకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం.  

రిసోర్స్‌ మొబిలైజేషన్‌ సబ్‌ కమిటీ భేటీ 
శుక్రవారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్‌ మొబిలైజేషన్‌ సబ్‌ కమిటీ సమావేశం కానుంది. పురపాలక శాఖ, టీజీఐఐసీ ఒక్కో శాఖ ప్రతినెలా భూముల అమ్మకాల ద్వారా కనీసం రూ.1000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించనున్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ల్యాండ్‌ పూలింగ్‌ విధానంపై సబ్‌ కమిటీకి నివేదిక సమరి్పంచనున్నారు. హిల్ట్‌–పీ అమలు తీరుపై టీజీఐఐసీ ఎండీ వివరాలు అందించాలని కమిటీ ఆదేశించింది. ఈ సబ్‌ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement