టైం బాంబ్‌లు అమర్చి.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం | Jaish Module Busted: Time Bomb Plot Foiled in Gujarat | Sakshi
Sakshi News home page

టైం బాంబ్‌లు అమర్చి.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Jul 17 2026 10:34 AM | Updated on Jul 17 2026 10:46 AM

Jaish Module Busted: Time Bomb Plot Foiled in Gujarat

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్‌ ఏ మహ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇదే  ఉగ్ర మాడ్యుల్‌కు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అలాగే విచారణలో.. దేశంలోని పలు ప్రాంతాల్లో టైం బాంబ్‌ పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు నిర్ధారించారు.

పటాన్‌ జిల్లాలోని ఖడియాల్‌ గ్రామంలో గురువారం ఐదుగురు జేషై గ్రూప్‌ సభ్యుల్ని గుజరాత్‌ ఏటీఎస్‌ అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో బిలాల్‌ అబిద్‌భాయ్‌ షెరా, మహ్మద్‌ అయూబ్‌ కడివాలా, మహ్మద్‌ పలాన్‌పురి అలియాస్‌ ఖలీ అయూబ్‌ సున్సారా, షఫియా రైస్‌ ముక్తి, మహ్మద్‌ హసన్‌ కర్డియా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఎనిమిది మంది అనుమానితుల విచారణలో ఈ ఐదుగురి పేర్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. జూలై 24 వరకు ఏటీఎస్‌ కస్టడీకి అప్పగించారు.

దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు.. టైం బాంబ్‌ తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా టైం బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడాలని చూసిందని చెప్పారు. అయితే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రి, జైష్‌ ఏ మహ్మద్‌కు సంబంధించిన ఉర్దూ సాహిత్యం ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. 

ముఠా సభ్యులు తయారు చేసిన పేలుడు పదార్థాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రయోగం విఫలమైందని అధికారులు వెల్లడించారు. బాంబు తయారీ సామగ్రి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడ దాచారు? ఉగ్ర సంస్థకు సంబంధించిన సాహిత్యం వారికి ఎలా చేరింది? అనే అంశాలపై ఏటీఎస్‌ దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో జూలై 3న గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జైష్‌ ఏ మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసింది. గుజరాత్‌లో క్రియాశీల ఉగ్ర నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. తాజా అరెస్టులతో జైష్‌ ఏ మహ్మద్‌ మాడ్యూల్‌ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు జరిగిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement