రైల్వేలో కొత్త శకం.. భారత్ తొలి హైడ్రోజన్ రైలు.. ఫుల్‌ డీటెయిల్స్‌.. | India Enters Hydrogen Rail Era, First 10 Coach Hydrogen Fuel Cell Train With 2,600 Passenger Capacity Begins Service | Sakshi
Sakshi News home page

రైల్వేలో కొత్త శకం.. భారత్ తొలి హైడ్రోజన్ రైలు.. ఫుల్‌ డీటెయిల్స్‌..

Jul 16 2026 9:05 PM | Updated on Jul 17 2026 11:53 AM

Indias first hydrogen train Check full details

Representative image

హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్‌ రైళ్లను నడిపే దేశాల జాబితాలో భారత్ చేరుతోంది.. హరియాణాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు సేవలను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. 10 బోగీలతో రూపొందించిన ఈ రైలుకు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. 

ప్రపంచంలో అభివృద్ధి చేసిన అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఇది ఒకటి. సాధారణ విద్యుత్ రైళ్ల మాదిరిగా పైభాగంలో ఉండే విద్యుత్ తీగలు, డీజిల్ ఇంజిన్‌పై ఇది ఆధారపడదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ల సాయంతో రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నేరుగా వెలువడే ఉద్గారాలుగా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయని పత్రికా సమాచార శాఖ తెలిపింది. బ్రాడ్ గేజ్ రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసి డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తోంది. భారతీయ రైల్వే చేపట్టిన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయి.

మార్గం వివరాలు
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తుంది. ఈ రైలు జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ మధ్య ప్రయాణిస్తుంది. మధ్యలో జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఈసాపూర్ ఖేరి హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మొహానా, బర్వాస్ని హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది. ప్రతిపాదిత హాల్ట్‌లలో కూడా సేవలు అందిస్తుంది.

సాధారణ పరిస్థితుల్లో హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైలు సేవలు ఎంత సమర్థంగా, ఎంత భద్రంగా, ఎంత విశ్వసనీయంగా పనిచేస్తాయో నిరూపించేందుకు ఈ మార్గాన్ని ఎంపిక చేశారు.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌లతో పరుగులు
ఈ రైలు ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ (పీఈఎం) ఫ్యూయల్ సెల్ వ్యవస్థతో పనిచేస్తుంది. అధిక పీడన సిలిండర్లలో నిల్వ చేసిన హైడ్రోజన్, వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ట్రాక్షన్ మోటార్లను నడుపుతుంది.

ఈ రైలులో రెండు చివరల వద్ద రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, మధ్యలో 8 ప్రయాణికుల బోగీలు ఉన్నాయి. ప్రతి పవర్ కారు 1,200 కిలోవాట్ల శక్తి, అంటే దాదాపు 1,600 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేశారు. అయితే పైలట్ దశలో ఉత్తర రైల్వే పరిధిలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ సేవల నిర్వహణకు అవసరంగా హరియాణాలోని జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని భారతీయ రైల్వే నిర్మించింది.

ఈ కేంద్రంలో విద్యుద్విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. దానిని 500 బార్ పీడనానికి కుదించి, 350 బార్ పీడనంతో రైలుకు నింపుతారు. దీనివల్ల రెండు పవర్ కార్లలో ఒకేసారి హైడ్రోజన్ నింపే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇది సాధారణ రైలు సేవలు కొనసాగించేందుకు సరిపోతుంది.

అధికారుల సమాచారం ప్రకారం, హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, కుదింపు, నింపడం, రైలు నిర్వహణ వంటి అన్ని దశలను కలిపిన దేశంలోని తొలి సమగ్ర రైల్వే హైడ్రోజన్ వ్యవస్థ ఈ ప్రాజెక్టుతో ఏర్పడింది.

విదేశాల్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్ల కంటే పెద్దది
హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. అయితే వాటిలో ఎక్కువ రైళ్లలో 2 నుంచి 4 బోగీలు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా ప్రాంతీయ మార్గాల్లోనే అవి నడుస్తున్నాయి.

10 బోగీలతో రూపొందించిన భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. అధిక సామర్థ్యం ఉన్న ప్రయాణికుల రైలు సేవలకు హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించవచ్చని ఇది నిరూపిస్తోందని తెలిపింది.

భారత్‌లోనే తయారీ
భారతీయ రైల్వే ఆధ్వర్యంలో స్వదేశీ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేశారు. పరిశోధన, నమూనాల రూపకల్పన, ప్రమాణాల సంస్థ (ఆర్‌డీఎస్‌ఓ) సాంకేతిక రూపకల్పన, ఆమోద ప్రక్రియకు నాయకత్వం వహించింది. మేధా సర్వో డ్రైవ్స్ రైలు వ్యవస్థను సమీకరించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైలు బాహ్య రూపాన్ని రూపొందించింది.

జింద్-సోనిపట్ రైలు సేవలు తొలుత పైలట్ ప్రాజెక్టుగా నడుస్తాయి. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా, దీర్ఘకాలిక నెట్ జీరో లక్ష్యాల దిశగా కల్కా-షిమ్లా రైల్వే వంటి వారసత్వ మార్గాల్లో కూడా హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement