భారత్‌లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే.. | COVID-19 Cases Rise Again in India: New Omicron Variants Behind Fresh Surge | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి కరోనా రీఎంట్రీ! అసలు కారణం ఏంటంటే..

Jul 17 2026 6:41 AM | Updated on Jul 17 2026 6:54 AM

COVID-19 Cases Rise Again in India: New Omicron Variants Behind Fresh Surge

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చరిత్రలో కలిసిపోయిందనుకుంటున్న తరుణంలో.. వైరస్‌ మరోసారి తన ఉనికిని చాటుకుంటోంది. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. అయితే ఆరోగ్య నిపుణులు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పరిస్థితిని గత మహమ్మారి దశతో పోల్చాల్సిన అవసరం లేదంటున్నారు. అయినప్పటికీ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడం, కొన్ని రాష్ట్రాల్లో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం కరోనా ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం కేరళలో 115 కేసులు నమోదవగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో 13 కేసులు నమోదయ్యాయి. సంఖ్య పరంగా ఇవి పెద్దగా కనిపించకపోయినా, గత కొంతకాలంగా కేసులు చాలా తక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మళ్లీ వైరస్‌ ఉనికి నమోదు కావడం ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.

అసలు కారణం ఇదేనా?
ఈసారి కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా ఒమిక్రాన్‌కు చెందిన కొత్త సబ్‌ వేరియంట్లనే వైద్య నిపుణులు భావిస్తున్నారు. వైరస్‌ కాలానుగుణంగా జన్యుపరమైన మార్పులు చెందడం సహజ ప్రక్రియ అని, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న NB.1.8.1, XFG వంటి సబ్‌ వేరియంట్లు గతంలో కరోనా సోకినవారికైనా, టీకాలు తీసుకున్నవారికైనా మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం కలిగి ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్లు గతంలో డెల్టా వేరియంట్‌లా తీవ్ర అనారోగ్యానికి దారితీస్తున్నాయనే ఆధారాలు ఇప్పటివరకు లేవని కూడా స్పష్టం చేస్తున్నారు.

అదే సమయంలో గతంలో ఇన్‌ఫెక్షన్‌ లేదంటే టీకాల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోవడం, కరోనా పట్ల ప్రజలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబించడం, మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలను పూర్తిగా వదిలేయడం, రద్దీ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరగడం వంటి అంశాలు కూడా వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఏపీలో ఆందోళనకరంగా.. 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ ఆందోళనకరంగా ఉంది. గత నెల 26వ తేదీ నుంచి ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు మరణించగా, ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కోలుకున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ కరోనా సోకిన రోగుల్లో మరణాలు నమోదవడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.

ఈ లక్షణాలు ఉంటే కరోనానే!
ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నప్పటికీ, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరణించిన వారిలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త సబ్‌ వేరియంట్లతో సోకినవారిలో ఎక్కువగా జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి సాధారణ వైరల్‌ ఫీవర్‌ లేదా జలుబు లక్షణాలను పోలి ఉండటంతో చాలామంది పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ లక్షణాలు రెండు, మూడు రోజులకుపైగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

అయినా కేంద్రం అలర్ట్‌
తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట పరీక్షలు పెంచాలని, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా కొత్త వేరియంట్లపై నిఘా కొనసాగించాలని సూచించింది. అలాగే ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేయడం, హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను అమలు చేయడం కూడా ప్రారంభమైంది.

తెరపైకి జాగ్రత్తలు
ఆరోగ్య నిపుణులు ప్రజలను భయపడొద్దని, కానీ నిర్లక్ష్యం కూడా చేయొద్దని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌ ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం, స్వీయ చికిత్సకు బదులుగా వైద్యుల సలహా తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.

ప్రస్తుతం పరిస్థితి గతంలో మాదిరిగా లేకపోయినా, కరోనా వైరస్‌ ఇంకా సమాజంలోనే ఉందనే విషయాన్ని తాజా కేసులు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల భయాందోళనలకు గురికాకుండా, అప్రమత్తంగా ఉండడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ప్రస్తుతం ప్రజలకు ఉత్తమ రక్షణ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement