పాలకొండ అటవీ రక్షణ అధికారిపై భార్య ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: తనతో కాపురం చేయాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని తన భర్త మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ అటవీ రక్షణ అధికారి గొల్లంగి తారకేశ్వరరావు వేధిస్తున్నట్లు అతడి భార్య, దళిత సినీనటి కనపర్తి దీనమ్మ గురువారం శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు చాలాసార్లు అబార్షన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకళ్లుమర్రుకు చెందిన తాను 2017లో హైదరాబాద్‌లో నర్సుగా పనిచేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో శ్రీకాకుళం బలగకు చెందిన దూగాన జగదీష్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా తనకు పరిచయమైనట్లు తెలిపారు.
‘2018లో జగదీష్ చిత్రీకరించిన ఒక పాటలో నటించాను. ఆ సమయంలో కెమెరామెన్‌గా చేస్తున్న తారకేశ్వరరావుతో ఏర్పడిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. 2020 డిసెంబరు 24న పెద్దల సమక్షంలో శ్రీకాకుళం వరం కాలనీలో పెళ్లి చేసుకున్నాం. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుందామని అడిగితే ఉద్యోగంలో సమస్య వస్తుందని చెప్పేవాడు. పిల్లలు పుట్టకుండా చాలాసార్లు అబార్షన్ చేయించాడు.
నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చి సంపాదించిన డబ్బుల్లో రూ.40 లక్షల వరకు తారకేశ్వరరావు తీసుకున్నాడు. విశాఖపట్నంలో మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో గట్టిగా అడిగా. అప్పుడు నీతో బతికేది లేదు. కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదు. రూ.50 లక్షలు ఇస్తేనే ఏలుకుంటా.. అని తారకేశ్వరరావు చెప్పాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.


