తాళికట్టాకే దహన సంస్కారాలు చేయాలి | Incident in Prakasam district | Sakshi
Sakshi News home page

తాళికట్టాకే దహన సంస్కారాలు చేయాలి

Jul 17 2026 5:21 AM | Updated on Jul 17 2026 5:21 AM

Incident in Prakasam district

యువతి మృతదేహంతో ప్రేమికుడి ఇంటివద్ద ఆమె తల్లిదండ్రుల ఆందోళన 

ఎనిమిదేళ్ల ప్రేమ అనంతరం పెళ్లికి నిరాకరించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయి 

ప్రేమ విఫలం కావడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కీర్తి ఆత్మహత్య 

దీంతో ఖతార్‌కు పరారైన సాయి

టంగుటూరు: ఎనిమిదేళ్ల ప్రేమ అనంతరం పెళ్లికి ప్రేమికుడు నిరాకరించడంతో ప్రేమికురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికుడి కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని, మృతదేహానికి అతడు తాళికట్టిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఘటనలు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సంచలనం కలిగించాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగళ్ల కీర్తి (24) ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల కిందట ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన పాపినేని సాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సాయి ఖతార్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

సాయి ముంబై వచ్చి, కీర్తి ఖతార్‌ వెళ్లి తరచు కలుస్తుండేవారు. సాయికి అతడి కుటుంబసభ్యులు వారం కిందట పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తననే పెళ్లి చేసుకోవాలని సాయిని కోరింది. ఈ విషయమై ఇద్దరికి వివాదం జరిగింది. కీర్తి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారం కిందట తల్లిదండ్రుల వద్దకు వచ్చి సాయితో పెళ్లి చేయాలని, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని కోరింది. దీంతో వాళ్లు ఒంగోలులోని సాయి మేనత్త ఇంట్లో చర్చలు జరిపారు. అదే సమయంలో సాయి కూడా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేయడంతో వారు ఇంటికి వెళ్లి కీర్తికి నచ్చజెప్పి ముంబై పంపారు.

తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి.. ఈ నెల 14న ముంబై నుంచి తన తల్లిదండ్రులకు కాన్ఫరెన్స్‌ కాల్‌ చేసింది. ఆ సమయంలో సాయి కూడా కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఉన్నాడు. నా చావుకి కారణం సాయి అని చెబుతూ తాను ఉంటున్న హాస్టల్లో ఉరేసుకుని మృతిచెందింది. ఆమె కుటుంబసభ్యులు, సాయి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్చేశారు. ఆమె గదికి వెళ్లి చూసేసరికి కీర్తి ఉరేసుకుంది. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబస­భ్యులకు అప్పగించారు. సాయి ఖతార్‌కి పరార­య్యా­డు. సాయి తల్లి పొందూరు నుంచి వెళ్లిపోయింది. 

మృతురాలి కుటుంబసభ్యుల ఆందోళన 
కీర్తి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ముంబై నుంచి నేరుగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. సాయి మోసం చేయడంతోనే కీర్తి ఆత్మహత్య చేసుకుందని, సాయితో తాళికట్టించి అతడితోనే పొందూరులో దహన సంస్కారాలు నిర్వహించాలని కీర్తి చివరి కోరిక అని ఆందోళనకు దిగారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పొందూరు చేరుకుని గ్రామస్తులు, సాయి కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. సాయి ఖతార్‌ నుంచి వచ్చి కీర్తికి తాళికట్టి అతడే దహన సంస్కారాలు చేయాలని కీర్తి తల్లిదండ్రులు పట్టుబట్టారు. సాయి ఖతార్‌ నుంచి రావడానికి సమయం పడుతుందని, తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని సాయి మేనమామ వేజెండ్ల గంగాధర్‌ వారికి నచ్చజెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం అందుకు కీర్తి తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో పొందూరులో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement