వరి సాగు ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయువుల (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ఉద్గారాలకు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, దశాబ్ద కాలంలో కార్బన్ డయాక్సైడ్ 11.4 శాతం పెరిగింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కార్బన్ ఉద్గారా లలో 30 శాతం వ్యవసాయం ద్వారా విడుదలవుతున్నాయి. కొద్దిపాటి మార్పులు చేస్తే వ్యవసాయ రంగం నుండి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.
కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా మీథేన్ వెలువడే పంటపొలాల్లో అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణంనుంచి సంగ్రహించి భూమిలో స్థిరీకరించే దిశగా యాజమాన్య పద్ధతులుపాటించవచ్చు.నీటినిల్వ వరి సాగుతో పోలిస్తే అడపా దడపా నీటి పారుదల ద్వారా సాగు చేసే వరి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది.
ఇంకా వరుసల మధ్యలో మురుగునీటిని తీసివేయడం వలన దిగుబడిలో వ్యత్యాసం లేకుండా 50 శాతం వరకు ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. దీని వలన కార్బన్ క్రెడిట్‌లు ఎకరాకు 1–2 చొప్పున పొంద వచ్చు. నేరుగా దమ్ములో వరి విత్తడం ద్వారా, వరి నాటు పద్ధతితో పోల్చుకుంటే 16–54% మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది. దమ్ము చేసి వరి నాటే పద్ధతి నుంచి నేరుగా వరి విత్తే పద్ధతిని అవలంబించి, కలుపు రసాయనాల ద్వారా కలుపు నివారించి, నీటి యాజమాన్యం చేపట్టి, యాంత్రీకరణ ద్వారా కొంత మేర మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.
వరిలో అధిక మోతాదులో నత్రజని వాడటం వలన మిథనోజెనిక్ బ్యాక్టీరియా చర్యను తగ్గించి 30–50 శాతం మిథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. వేపచెక్క, వేపనూనె, వేప పూసిన యూరియా వాడటం వల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటుగా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కంటే ఎక్కువ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి.
వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు విడుదలై జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వరిగడ్డిని కంపోస్ట్ చేసి కానీ లేదా భూమిలో కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత వరి గడ్డి మల్చింగ్ చేయడం వలన నైట్రస్ ఆక్సైడ్ 10% తగ్గింది కానీ మీథేన్ 8% పెరిగినది. దీని వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతున్నందువలన ఈ పద్ధతిని ప్రోత్సహించాలి.
సహజ వ్యవసాయం, సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో వరినాట్లు వేసిన తరువాత, వరి పంట చుట్టూ కందకంలా చేసుకొని అందులో చేపల పెంపకం, అలాగే కందకం గట్టుపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, ఇతర ధాన్యపు పంటలు సాగుచేయాలి. ఈ పంటలతో పాటుగా పాడి, కోళ్ళ పెంపకం చేపట్టినట్లైతే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.
కర్బన క్రెడిట్–కర్బన మార్కెట్లు
కర్బన క్రెడిట్ అనేది వాతావరణంలోకి విడుద లయ్యే హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా సంపాదించే వ్యాపారయోగ్యమైన ధ్రువీకృత యూనిట్. సాధారణంగా ఒక కర్బన క్రెడిట్ = ఒక మెట్రిక్ టన్ను (1000 కిలోగ్రాములు) కార్బన్ డై ఆక్సైడ్ లేదా దానికి సమానమైన ఇతర హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది.
పరిశ్రమలు, సంస్థలు లేదా వ్యక్తులు తమ ఉద్గారాలను పూర్తిగా తగ్గించలేని పరిస్థితిలో, ఇతరులు సాధించిన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తమ ఉద్గారాలను సమ తుల్యం చేసుకోవచ్చు.వరి సాగులో నీటి నిర్వహణ, ఎరువుల సమర్థ వినియోగం, మీథేన్ ఉద్గారాల తగ్గింపు వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే హరిత గృహ వాయువులను తగ్గిస్తే, ఆ తగ్గింపును కొలిచి ధ్రువీకరించిన తర్వాత రైతులకు లేదా రైతు సమూహాలకు కార్బన్ క్రెడిట్లు జారీ చేస్తారు. దీనివల్ల అదనపు ఆదాయం, నీటి వినియోగంలో గణనీయమైన ఆదా, సాగు ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్యం మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయం, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లలో భాగస్వామ్యం రైతులకు చేకూరతాయి.
– డా‘‘ బి. సహదేవ రెడ్డి, డా‘‘ కె. తేజస్వరరావు ,ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు


