వాషింగ్టన్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాతో పౌర అణు సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌లు సంతకాలు చేశారు. ఈ వివరాలను యుఎస్‌ఏ అధికారికంగా ప్రకటించింది.
ఈ అంశంమై అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో "ఈ రెండు ఒప్పందాలు దశాబ్దాల పాటు కొనసాగే, బిలియన్ల డాలర్ల భాగస్వామ్యానికి చట్టపరమైన పునాదిని వేస్తాయి. అణు వ్యాప్తి నిరోధకత సహా పలు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను ఇవి ముందుకు తీసుకెళ్తాయి" అని ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఒప్పందంలో భాగమైన "ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం" ప్రకారం, సౌదీ అరేబియా తన అణు ప్లాంట్లలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అమెరికా అధికారుల తనిఖీలకు అంగీకరించాల్సి ఉంటుంది. దీనివల్ల అణు ప్లాంట్లలో ఏం జరుగుతోంది, ఎంత ఇంధనం వాడుతున్నారు అనేది పారదర్శకంగా తెలుస్తుంది. రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉండదు.
సాధారణంగా అమెరికా ఇచ్చే పౌర అణు ఒప్పందాలలో ఇతర దేశాలు తమ సొంత భూభాగంలో యురేనియాన్ని శుద్ధి చేయడానికి అనుమతించవు (దీనినే అణు నియమాలలో 'గోల్డ్ స్టాండర్డ్' అంటారు).కానీ ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా-సౌదీల సంయుక్త అధ్యయనం తర్వాత సౌదీ అరేబియా తన సొంత భూభాగంలోనే యురేనియం శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది.
'గోల్డ్ స్టాండర్డ్' నియమాల మినహాయింపు
గతంలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఒప్పందం చేసుకున్నప్పుడు యురేనియం శుద్ధి చేయకూడదని, వాడేసిన ఇంధనాన్ని రీ-ప్రాసెస్ చేయకూడదని కఠినమైన నిబంధన విధించింది. అయితే సౌదీ విషయంలో ఈ ముందస్తు నిషేధాలను సడలించడం ఒక ప్రధాన మార్పుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


