మద్యం కేసు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం జరిగిందనే విమర్శలు
సీబీఐ, ఈడీ విచారణతో పార్టీలో ప్రకంపనలు
కవిత అరెస్టయి జైలుకు వెళ్లడంతో పార్టీపై పెను ప్రభావం
కేసీఆర్‌కు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేయడంతో..ఆ కేసు రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశమయ్యింది. కేసు పూర్వాపరాలను, కవితపై ఆరోపణలు, అరెస్టు తదితర పరిణామాల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు కూడా చర్చనీ యాంశమవుతున్నాయి.
ముఖ్యంగా ఈ కేసు కారణంగా బీఆర్ ఎస్ భారీ కుదుపులకు లోనైందని, రాజకీయంగా నష్టపోయిందంటూ ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఎన్నికల్లో దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును తెరపైకి తెచ్చిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి.
అనేక కీలక పరిణామాలు..
లిక్కర్ కేసులో కవితను ఈడీ, సీబీఐ విచారించడంతో మొద లైన వివాదం పార్టీలో ఇంటా బయటా అనేక పరిణామాలు, రాజకీయ మలుపులకు దారి తీసింది. మద్యం పాలసీ కేసులో ముడుపులు ఆరోప ణలతో కవితను 2024 మార్చిలో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఇది బీఆర్‌ఎస్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే ఏడాది ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవక పోవడానికి కవితపై వచ్చిన ముడుపుల ఆరోపణలు, ఆమె అరెస్టే కారణమంటూ పార్టీ లోపలా బయటా విమర్శలు వెల్లువెత్తాయి.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే..
రాష్ట్ర్టంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ మద్యం పాలసీ అంశం తెరమీదకు వచ్చింది. 2021లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం 2021–22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. రిటైల్ మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ఈ విధానం ప్రవేశ పెట్టారు. అయితే లైసెన్సుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా, ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది.
ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చారనే కోణంలో..
‘సౌత్ గ్రూప్’ పేరిట దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేత లు ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చి లైసెన్సులు పొందారనే కోణంలో విచారణ జరిగింది. ఇందులో నాటి తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, అప్పటి ఎమ్మెల్సీ కవిత కూడా ముడుపులు ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హైదరా బాద్, ఢిల్లీలో ఈడీ, సీబీఐ వేర్వేరుగా కవితను పలుమార్లు విచారించాయి. తనపై రాజ కీయ ప్రేరేపిత కేసు నమోదైందని కవిత వాదించారు. 2024 మార్చిలో కవిత అరెస్టు అయ్యారు. 2024 చివరలో ఈడీ, సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేశాయి. సుమారు ఐదు నెలల పాటు జైలు జీవితం తర్వాత కవిత బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.


