ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం | Indian Women Drive Financial Independence From Earnings To Smart Investments, Increasingly Taking Charge Of Finances | Sakshi
Sakshi News home page

ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

Mar 5 2026 12:03 PM | Updated on Mar 5 2026 12:24 PM

Indian Women Drive Financial Independence From Earnings to Smart Investments

భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా తమ కష్టార్జితాన్ని ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలనే విషయంలో మునుపెన్నడూ లేని విధంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ‘డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ విన్వెస్టర్ పల్స్’ నివేదిక ఈ ఆసక్తికర మార్పును వెల్లడించింది.

పెరిగిన అవగాహన.. మారిన ధోరణి

దేశవ్యాప్తంగా 5,050 మంది ఇన్వెస్టర్లపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే మహిళలు 2022లో 44 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 56 శాతానికి పెరిగింది. ఆన్‌లైన్ వేదికల ద్వారా లభిస్తున్న సమాచారం, పెరిగిన ఆర్థిక అక్షరాస్యత ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. సర్వే ప్రకారం.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ప్రొఫెషనల్ అడ్వైజర్ల సలహా తీసుకుంటూ పూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆన్‌లైన్ అడ్వైజర్లకు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. అందుకే ఇప్పటికీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్లకే మొగ్గు చూపుతున్నారు.

పురుషులు వర్సెస్ మహిళలు

పెట్టుబడుల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది. మార్కెట్లు పతనమైనప్పుడు పెట్టుబడులను పెంచే విషయంలో పురుషులు (15%) ముందుండగా, మహిళలు (10%) కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు ఎక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఇది వారు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో పరిణతి సాధిస్తున్నారని సూచిస్తోంది.

‘మహిళలు కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, సమాచారంతో కూడిన స్వతంత్రతను ప్రదర్శిస్తున్నారు. మార్కెట్లను అర్థం చేసుకుంటూ తమ ఆశయాలకు అనుగుణంగా పెట్టుబడులను మలుచుకుంటున్నారు’ అని డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ చైర్‌పర్సన్ అదితి కొఠారీ దేశాయ్ అన్నారు.

ఇదీ చదవండి: ఏఐ సంక్షోభం.. ఏం చేయాలో ఆలోచించాలి!

Advertisement
 
Advertisement
Advertisement