
భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. అయితే మోటార్‌స్పోర్ట్ రంగం మాత్రం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీనిని అభివృద్ధి చేయాలంటే.. తగిన ఎన్విరాన్‌మెంట్ ఏర్పాటు చేయాలని, రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) అన్నారు. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఈ విభాగం అంతగా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు.
ఒక సమావేశంలో గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, మీరు మోటార్‌స్పోర్ట్‌లో ప్రపంచ స్థాయిలో రాణించాలనుకుంటే, దానికి తగిన పర్యావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు, భారతదేశంలో క్రికెట్ కోసం ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. కొందరు గల్లీలలో క్రికెట్ ఆడతారు. అలా క్రికెట్ మన జీవన శైలిలో భాగమైపోయింది. క్రికెట్ మాదిరిగా.. మోటార్‌స్పోర్ట్ కోసం ప్రాక్టీస్ లేదు. ప్రస్తుతం మనకు భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే మోటార్‌స్పోర్ట్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఈ సంఖ్య యూకేలో 70,000 ఉందని ఆయన అన్నారు.

కార్టింగ్ లీగ్‌లు, పబ్లిక్ ట్రాక్‌లు.. పాఠశాల స్థాయి నుంచి అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో (మోటార్‌స్పోర్ట్) అభివృద్ధి ఆగిపోతోంది. నారాయణ్ కార్తికేయన్, జెహాన్ దారువాలా, కుష్ మైనీ.. చిన్న వయస్సు నుండే రేసింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!
ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గౌతమ్ సింఘానియా ఒక ఆటోమోటివ్ ఔత్సాహికుడు. ఈయన చాలా సందర్భాల్లో రేసింగ్‌లో పాల్గొన్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్‌లెగ్గేరా, లంబోర్ఘిని అవెంటడోర్ SVJ, ఫెరారీ 458 ఇటాలియా, మరియు మెక్‌లారెన్ 720ఎస్ వంటి రేసింగ్ కార్లు ఉన్నాయి. ఆయన ఇటీవలే వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ (WMSC)కు భారతదేశ అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఈ హోదాలో పనిచేస్తున్నారు.