
కలిసివుంటే కలదు అంటుంటారు మన పెద్దలు. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెబుతారు. కలిసివుంటే డబ్బు కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు గుజరాతీలు. వ్యాపార నిర్వహణ, డబ్బు సంపాదనలో గుజరాతీల ప్రావీణ్యం గురించి ప్రపంచమంతా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇట్టే కలిసిపోయేతత్వం వారి సొంతం. వర్తకాన్ని ఒడుపుగా నిర్వహించడం, బలమైన సమాజ సంబంధాలతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకొస్తుంటారు. అంతేకాదు తమవారికి దన్నుగా నిలిచి పైకి తీసుకురావడంలో వారికి వారే సాటి. తాజాగా గుజరాత్‌లోని జైన్ సామాజికవర్గం (Jain Community) ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచింది.
మనం మాంచి కాస్ట్లీ కారు కొనాలంటే ఏం చేస్తాం? దగ్గరలోని కార్ల షోరూంకు (Car Showroom) వెళ్లి మోడల్ సెలెక్ట్ చేసుకుని, రేటు మాట్లాడుకుంటాం. ఓ మంచి ముహూర్తం చూసుకుని కారును ఇంటికి తెచ్చుకుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యునిటీ వాళ్లు మనలా చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న తమవాళ్లలో ఎవరెవరు ఖరీదైన కొనాలనుకుంటున్నారో ముందుగా వాకబు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఇలాంటి వారి వివరాలను సేకరించింది. ఎవరెవరికి ఏయే మోడల్ కారు కావాలో తెలుసుకుంది. మొత్తం 186 కొత్త కార్లు లెక్కకువచ్చాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 15 రకాల టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.
ఒకేసారి 186 కార్లను కొనుగోలు చేసేందుకు JITO నేరుగా రంగంలోకి దిగింది. ఆయా కార్ల కంపెనీలకు చెందిన డీలర్లతో బేరసారాలు సాగించింది. ఒకేసారి ఎక్కువ కార్లు అమ్ముడవుతుండడంతో విక్రేతలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. JITO బేరసారాలతో తమ సభ్యులకు రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ లభించింది. రూ. 149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఒకేరోజు డెలివరీ చేయడం వరకు అంతా పక్కాగా జరిగింది. తామంతా ఐకమత్యంగా ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుతున్నామని JITO అపెక్స్ వైస్-చైర్మన్ హిమాన్షు షా తెలిపారు.
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నజైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు ఉన్నారు. సామూహిక కొనుగోలుతో భారీగా లబ్ధిపొందిన JITO తమ సభ్యుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశమంతా తమ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని టోకుగా కొని ప్రయోజనం పొందెలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆభరణాలు, ఇతర వస్తువుల సామూహిక కొనుగోలుకు రెడీ అవుతోంది.
121 జేసీబీలు.. రూ. 4 కోట్లు ఆదా
జైన్ కమ్యునిటీ మాత్రమే కాదు భర్వాడ్ సామాజికవర్గం (Bharwad Community) కూడా ఇదేవిధంగా తమ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. తమ కమ్యునిటీలోని యువత ఉపాధి కోసం గుజరాత్‌లోని భర్వాద్ యువ సంఘటన్ ఇటీవల 121 జేసీబీ యంత్రాల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయా వ్యాపార సంస్థలతో బేరాలు సాగించి ఒక్కొ యూనిట్‌కు రూ. 3.3 లక్షల తగ్గింపు పొంది రూ. 4 కోట్లు ఆదా చేసింది. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి తోడ్పాటు అందిస్తున్నామని భర్వాద్ యువ సంఘటన్ అధ్యక్షుడు దిలీప్ భర్వాద్ చెప్పారు. తాము ష్యూరిటీ ఇవ్వడంతో బలమైన క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా పాన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్‌తో JCBలను పొందారని వెల్లడించారు.
చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్
చూశారుగా కలిసి కొంటే ఎంత లాభమో.. అవి లగ్జరీ కార్లు (luxury cars) అయినా, భారీ యంత్రాలు అయినా. సామూహిక కొనుగోలు శక్తితో ఇన్ని ప్రయోజనాలుంటాయని గుజరాత్ కమ్యునిటీలు నిరూపిస్తున్నాయి. సో.. కలిసివుంటే సుఖపడటమే కాదు.. డబ్బు కూడా ఆదా చేయొచ్చు!