
టీవీఎస్ మోటార్ ఇండియన్ మార్కెట్లో.. 'అపాచీ ఆర్‌టీఎక్స్ 300' పేరుతో సరికొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పుడున్న టీవీఎస్ బైకుల కంటే ఇది కొంత భిన్నంగా ఉండటం గమనించవచ్చు.
అపాచీ ఆర్‌టీఎక్స్ 300.. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ & అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్ రియర్ సీటు, అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రంగులలో అందుబాటులో ఉంది.
ఆర్‌టీఎక్స్ 300 బైక్.. టీఎఫ్టీ డిస్ప్లే పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్లకు కావలసిన సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 35.5 హార్స్ పవర్, 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.