శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాహుబలి విమానం | Key Features of Antonov An 124 landing in RGIA shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాహుబలి విమానం

Nov 13 2025 2:25 PM | Updated on Nov 13 2025 3:08 PM

Key Features of Antonov An 124 landing in RGIA shamshabad

ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ (Antonov AN-124 Ruslan) తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో దర్శనమిచ్చింది. ఈ భారీ విమానం ల్యాండింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విమానాశ్రయానికి తరచూ కార్గో విమానాలు వస్తుంటాయి. కానీ, రుస్లన్ వంటి దిగ్గజ ఎయిర్‌క్రాఫ్ట్ రాక విమానయాన ప్రియులను, స్థానికులను ఆకర్షించింది.

ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ ప్రత్యేకతలు..

‘రుస్లన్’గా పిలువబడే ఆంటనోవ్ ఏఎన్-124.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో రెండో స్థానంలో ఉంది (మొదటి స్థానం ఏఎన్-225). ఈ విమానం గరిష్టంగా 150 టన్నుల వరకు కార్గోను మోయగలదు. దీని లోపల కార్గో కంపార్ట్‌మెంట్ పరిమాణం అధికంగా ఉంటుంది. సుమారు 36.5 మీటర్ల పొడవు, 6.4 మీటర్ల వెడల్పు, 4.4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీంతో భారీ , పొడవైన వస్తువులను సులభంగా రవాణా చేయవచ్చు.

కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ సులభతరం చేయడానికి విమానం ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. అంతేకాకుండా దీని ల్యాండింగ్ గేర్ ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉంది. దీని ద్వారా విమానం తన ఎత్తును తగ్గించుకుని వస్తువులను వాహనాల నుంచి నేరుగా లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. లోపల 30 టన్నుల బరువును ఎత్తగల క్రేన్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. దీని వల్ల సుదూర ప్రాంతాల్లో గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా లోడింగ్, అన్‌లోడింగ్ పనులు నిర్వహించవచ్చు. గరిష్ట ఇంధనంతో దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.

ఎలాంటి వస్తువులను రవాణా చేస్తారు?

ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్‌ను ముఖ్యంగా ఓవర్‌సైజ్డ్, హెవీ-లిఫ్ట్ కార్గో రవాణా కోసం ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి వాడే భారీ టర్బైన్లు, ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు సంబంధించిన భారీ డ్రిల్లింగ్ యంత్రాలు, బరువైన ఎర్త్ మూవర్స్, క్రేన్లు, లేదా 25 మీటర్ల పొడవున్న యంత్ర భాగాలను ఇందులో రవాణా చేస్తారు. మిలిటరీ వాహనాలు (ట్యాంకులు), కంప్లీట్ మిస్సైల్ సిస్టమ్స్, లేదా బోయింగ్ 777 వంటి పెద్ద విమానాల టర్బోఫ్యాన్ ఇంజిన్లు, రాకెట్ భాగాలను చేరవేస్తారు.

ఇదీ చదవండి: అమ్మకాలపై ఉన్న ఆసక్తి సర్వీసుపై ఏది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement