భారత్–రష్యా కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం
దేశంలో ఉత్పత్తి కానున్న
తొలి పూర్తి ప్యాసింజర్ విమానం ఇదే..
న్యూఢిల్లీ: భారత్–రష్యా ప్రభుత్వరంగ సంస్థలు కలిసి తొలిసారి భారత్‌లో ఒక ప్యాసింజర్ విమానాన్ని ఉత్పత్తి చేయనున్నాయి. రెండు ఇంజన్లు ఉండే చిన్న ప్యాసింజర్ విమానం ఎస్‌జే–100ను భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయా రు చేయనుంది. ఇందుకోసం రష్యాకు చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్‌సీ–యూఏసీ)తో సోమవారం మాస్కోలో ఒప్పందంపై హాల్ సంతకం చేసింది. హాల్ చైర్మన్ డీకే సునీల్, పీజేఎస్‌సీ–యూఏసీ డైరెక్టర్ జనరల్ వదిమ్ బదెఖా సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.
‘దేశంలో తక్కువ దూరం విమాన ప్రయా ణాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఉడాన్ పథకంలో ఎస్‌జే–100 విమానాలు గేమ్‌చేంజర్ కానున్నాయి. దేశీయ విమానయాన సంస్థల కోసం ఎస్‌జే–100 విమానాలను తయారు చేసేందుకు ఈ ఒప్పందం ద్వారా హాల్‌కు హక్కులు లభించాయి. ఈ విమానాల తయారీ దేశంలో విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. పౌర విమానయాన రంగ ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తుంది. ఈ ఒప్పందం విమానయానంలో ప్రైవేటు రంగాన్ని ప్రో త్సహించి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలను సృష్టిస్తుంది’అని హాల్ ఓ ప్రకటనలో పేర్కొంది.


