breaking news
MPs meet
-
బెంగాల్‌పై కాషాయదళం కన్ను
న్యూఢిల్లీ: దేశంలో కీలకమైన పెద్ద రాష్ట్రం పశ్చిమబెంగాల్లో అధికార పీఠంపై బీజేపీ కన్నేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సోమవారం ప్రధాని మోదీ స్వయంగా ఆ రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. అక్కడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో స్పందనను వారిని అడిగి తెలుసుకున్నారు. ‘రాష్ట్రానికి చెందిన మా పార్టీ ఎంపీలను వ్యక్తిగతంగా కలవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పరిణామం రానున్న ఎన్నికల సమరంలో పాల్గొనేలా వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది’అని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. ‘ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం గురించి, పథకాల గురించి ప్రజలేమనుకుంటున్నారు? అనే విషయాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు’మరో ఎంపీ లాకెట్ ఛటర్జీ వెల్లడించారు. 2016 ఎన్నికల్లో అసెంబ్లీలోని 295 స్థానాలకు గాను టీఎంసీ 211 సీట్లు, కాంగ్రెస్, సీపీఎం కలిపి 70 సీట్లు గెలుచుకోగా బీజేపీకి కేవలం మూడు సీట్లే దక్కాయి. టీఎంసీకి 45 శాతం ఓట్లు దక్కగా, బీజేపీకి 10శాతం మాత్రమే పడ్డాయి. కానీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 18 సీట్లు కైవసం చేసుకుంది. ఓటింగ్ శాతం పరంగా చూస్తే టీఎంసీకి 44 శాతం, బీజేపీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. ఈ అనూహ్య ఫలితాలు టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని షాక్‌కు గురిచేశాయి. -
నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశం కానుంది. హోంమంత్రి అమిత్ షా సహా పార్టీకి చెందిన ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరు కావచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుండటం గమనార్హం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా ఎన్నికైన అనంతరం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇదే తొలిసారి. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభంకానుంది. జులై 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు, పశ్చిమ బెంగాల్లో చెలరేగుతున్న ఎన్నికల అనంతర హింసాకాండ తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. -
గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో!
రైల్వే ప్రాజెక్టులపై నేడు ఎంపీల సమావేశం నగరంలో రైల్వే ప్రాజెక్టులపై తొలగని ప్రతిష్టంభన ప్రతిపాదనకే పరిమితమైన విమానాశ్రయానికి రైలు మార్గం చర్చల్లోనే భారీ టర్మినళ్లు ఆర్ఓబీలు, ఆర్యూబీలపై కొరవడిన పురోగతి రైల్‌నిలయంలో నేడు ఎంపీల సమావేశం సిటీబ్యూరో : నగరంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే ఉంది. కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమిత మైతే మరికొన్ని చ ర్చల దశను కూడా దాటడం లేదు. మరోవైపు ప్రారంభించిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ దృష్ట్యా పార్లమెంట్ సభ్యుల నుంచి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు దక్షిణమధ్య రైల్వే బుధవారం ఎంపీల సమావేశానికి శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులు, ప్రతిపాదనలు, పనుల పురోగతితో పాటు, కొత్తగా చేపట్టవలసిన వాటిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గతేడాది ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, నగర శివార్లలో నిర్మించాలని ప్రతిపాదించిన భారీ టర్మినళ్లపైన ఈ సమావేశం గుణాత్మకమైన పురోగతిని సాధించగలిగితే ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది. విమానాశ్రయానికి రైలు మార్గం... ప్రతిష్టాత్మకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. పటాన్చెరు-తెల్లాపూర్, మేడ్చల్-బోయిన్పల్లి మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ ప్రయాణికులు అతి తక్కువ టిక్కెట్ చార్జీలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేందుకు ప్రతిపాదించిన రైలు మార్గంపైన మాత్రం ఏడాది కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఉందానగర్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్లు కొత్తగా లైన్లు వేయవలసి ఉంది. కానీ జీఎమ్మార్ అందుకు నిరాకరిస్తోంది. విమానాశ్రయం లోపలి వరకు కాకుండా 3 కిలోమీటర్ల వరకే అనుమతినిస్తామని చెప్పడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం నాటి ఎంపీల సమావేశంలోనైనా ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విమానాశ్రయానికి రైలు మార్గానికి అడుగులు పడితే మంచిది. భారీ టర్మినళ్లు... ఉత్తర, దక్షిణభారత దేశానికి మధ్య ప్రధాన కేంద్రబిందువుగా ఉన్న హైదరాబాద్‌కు రైళ్ల తాకిడి బాగా ఉంది. ప్రతి రోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి లక్షలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రైళ్ల ఒత్తిడి దృష్ట్యా 2005లోనే సికింద్రాబాద్‌లో వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. పలు మార్లు బడ్జెట్లలో కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు మౌలాలి, వట్టినాగులపల్లిలో రెండు భారీ ప్రయాణికుల టర్మినళ్లను కట్టించాలనే ప్రతిపాదనలకు రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించినప్పటికీ భూముల కేటాయింపుపై ఎలాంటి చర్యల్లేవు. ఆర్ఓబీ, ఆర్‌యూబీలు... నగరంలోని తుకారాంగేట్, ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ, ఉప్పుగూడ, కందికల్‌గేట్, ఆలుగడ్డబావి తదితర ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతుండగా, మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు ఆరు నెలల క్రితమే ఆలుగడ్డ బావి వద్ద పనులు పూర్తయినప్పటికీ దానికి అనుబంధంగా రోడ్లు వేయకపోవడం వల్ల ప్రజలకు అందుబాటులోకి రాలేదు.