క్వాంటమ్ ఎకానమీ లీడర్‌గా హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి
దేశంలో క్వాంటమ్ రోడ్‌మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ
క్వాంటమ్ స్ట్రాటజీ ఆవిష్కరణ సమావేశంలో వెల్లడి
క్వాంటమ్ సిటీగా హైదరాబాద్: శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ‘భవిష్యత్తు క్వాంటమ్ ఎకానమీ లీడర్‌గా హైదరాబాద్ నిలుస్తుంది, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి అన్ని వనరులు హైదరాబాద్‌లో దండిగా ఉన్నాయి’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. తెలంగాణ క్వాంటమ్ వ్యూహం ద్వారా క్వాంటమ్ టెక్నాలజీకి ప్రత్యేక రోడ్‌మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. తాము యువ భారత్ క్వాంటమ్ స్టార్టప్ ఫండ్‌ను రూ.1,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. క్వాంటమ్ స్టార్టప్‌లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. మంగళవారం గచ్చిబౌలిలోని ఐఐఐటీలో జరిగిన నీతి ఆయోగ్ క్వాంటమ్ రోడ్ మ్యాప్, తెలంగాణ క్వాంటమ్ వ్యూహం ఆవిష్కరణ సభలో భట్టి మాట్లాడారు.
ఏఐపై అప్పుడే చర్చించుకున్నాం..
1980ల్లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి మాట్లాడుకున్నామని, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏఐ నడిపిస్తుందని నాడు వర్సిటీ విద్యార్థులుగా చర్చించుకున్న విషయాన్ని సభలో డిప్యూటీ సీఎం భట్టి పంచుకున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏ ఇతర సాంకేతికత కంటే కూడా వేగంగా అన్ని రంగాల్లోనూ మార్పు తీసుకురాబోతుందని చెప్పారు. ‘గొప్ప భవిష్యత్తు కోరుకునే ఏ దేశానికైనా క్వాంటమ్ వ్యూహం అవసరం. దేశాల భవిష్యత్తు, జాతీయ భద్రత, ఆర్థిక పరిమాణం, అభివృద్ధి, అన్నింటినీ ఇది తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది.
జాతీయ మిషన్‌కు అనుసంధానంగా రూపొందించిన తెలంగాణ క్వాంటమ్ వ్యూహం (టీక్యూఎస్), పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో లక్ష్యాలను సాధిస్తుంది’అని భట్టి చెప్పారు. పరిశ్రమ, విద్యాసంస్థల బలమైన భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇది అన్ని రంగాల్లో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి సహాయపడుతుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణ ప్రణాళికలకు అత్యంత కీలకమని భట్టి చెప్పారు. శాస్త్రీయ, విధాన దృక్పథం, కార్యసాధన శక్తి ఈ మూడింటినీ కలిపి విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమ, ప్రభుత్వం భాగస్వాములుగా పనిచేసే బలమైన ఎకోసిస్టమ్‌ను ఇది నిర్మిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ క్వాంటమ్ సిటీ: శ్రీధర్‌బాబు
క్వాంటమ్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా లాంగ్ టర్మ్ క్వాంటమ్ వ్యూహాన్ని రూపొందించామని చెప్పారు. అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు.
ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ తదితర ఆధునాతన సాంకేతికతలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పారిశ్రామికవేత్తలతో తరచూ సమావేశమై చర్చించి పరిష్కరిస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, సభ్యుడు డా. వీకే సారస్వత్, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, ఐఐఐటీ, ఐఐటీ, సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్, టీఐఎఫ్‌ఆర్ ప్రముఖులు పాల్గొన్నారు.


