నేటి నుంచి అండర్–19 ఆసియాకప్ క్రికెట్ టోర్నీ
తొలి మ్యాచ్‌లో యూఏఈతో భారత్ ‘ఢీ’
ఆదివారం భారత్, పాకిస్తాన్ పోరు
మ్యాచ్‌లన్నీ ఉదయం గం. 10:30 నుంచి ప్రారంభం
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్షప్రసారం
దుబాయ్: యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసే మరో టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా నేటి నుంచి అండర్–19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌కు తెరలేవనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో యువ భారత జట్టు తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఐపీఎల్ సహా దేశవాళీ టోర్నీల్లో విధ్వంసక సెంచరీలతో ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో అండర్–19 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ టోర్నీ మన ప్లేయర్లకు రిహార్సల్‌గా ఉపయోగపడనుంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్ షేక్’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు.
‘హ్యాండ్ షేక్‌పై ప్లేయర్లు ఏమీ చెప్పలేరు. టీమ్ మేనేజర్ ఆనంద్ దాతర్‌కు బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు అందుతాయి. ఒకవేళ కరచాలనం చేయకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని మ్యాచ్ రిఫరీకి ముందే తెలుపుతాం’ అని ఓ అధికారి తెలిపారు. క్రీడల్లో రాజకీయాలకు తావులేదని తెలిసినా... బోర్డు నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఆయన అన్నారు.
భారత్ బరిలోకి దిగుతున్న గ్రూప్ ‘ఎ’లోనే దాయాది పాకిస్తాన్ కూడా ఉండగా... ఇరు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లతో పాటు యూఏఈ, మలేసియా జట్లు కూడా గ్రూప్ ‘ఎ’లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక జట్లు గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతున్నాయి.
భారత్ బలంగా...
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, దేశవాళీల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగే ఆయుశ్ మాత్రే యంగ్ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీలో వరుస సెంచరీలతో చెలరేగిన మాత్రేపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొత్తం టోర్నమెంట్‌కు ప్రధాన ఆకర్షణ అయిన వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది.
సీనియర్ క్రికెట్‌లోనే తన దూకుడుతో ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్... ముస్తాక్ అలీ టోర్నీలో శతకం బాదిన అతి పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. 15 మందితో కూడిన భారత జట్టులో ఈ ఇద్దరూ సీనియర్ స్థాయిలో వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 30కి పైగా మ్యాచ్‌లు ఆడారు. వాటిలో 9 శతకాలు తమ పేరిట లిఖించుకున్నారు. ఈ నయా జనరేషన్ జోరును మిగిలిన జట్లు ఏమాత్రం అడ్డుకుంటాయో చూడాలి.
వైస్ కెపె్టన్ విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞ, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జి కూడా బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థులే. ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌కు మినహా... ఇతర జట్లకు 50 ఓవర్ల ఆటలో పెద్దగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమే.
భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెపె్టన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, అభిజ్ఞ కుండు, హర్‌వంశ్ సింగ్, యువరాజ్ గోహిల్, కనిష్క చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జి.


