రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్‌టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయ్ వల్లందాస్ నిర్మాతగా వ్యవహరించాడు. నేడు(డిసెంబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కొండాపూర్ ఎస్సై రాంఖీ అలియాస్ రామ్ కుమార్(అబిద్ భూషన్) మిస్ అవుతాడు. 15 రోజులు అయినా అతని ఆచూకీ లభించదు. దీంతో రాంఖీ మిస్సింగ్ కేసును చేధించడానికి ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్చర్ విరాట్(రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్‌కి వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? విరాట్ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను ఇల్లీగల్‌గా ఓ గన్‌ని ఎందుకు కొన్నాడు? ఇంతకీ రాంఖీ బతికే ఉన్నాడా? చనిపోయాడా? ఈ కేసును ఏసీపీ ఆనంద్ ఎలా సాల్వ్ చేశాడు? ఈ కథలో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి మిస్ అవ్వడం.. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు హంతకులను పట్టుకోవడం.. ఈ సినిమా కథనం కూడా అలానే సాగుతుంది. అయితే పోలీసు మిస్ అవ్వడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంత సేపు… మనం గతంలో వచ్చిన కొన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. ట్రయాంగ్ లవ్‌స్టోరీకి కొన్ని ట్విస్ట్‌లు ఆధ్యాంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.
ఇటు కథను రన్ చేస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ.. వెను వెంటనే ట్విస్ట్‌లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్‌కు అసలు కిల్లర్ ఎవరూ అనే క్వశ్చన్ మార్క్ క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ఆడియన్‌ను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత వరకు సక్సెస్ అయినట్టే. ఇంటర్వెల్ వరకు పెద్దగా ట్విస్టులు ఉండవు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది. ఒక్కొక్కటి ట్విస్ట్ రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్… సినిమాను మలుపుతిప్పుతుంది. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈ ట్విస్ట్‌ని ఊహించొచ్చు. ఫస్టాఫ్‌ని కాస్త బలంగా రాసుకొని..సాగదీత లేకుండా జాగ్రత్త పడితే కథనం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
మెయిన్ లీడ్‌లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సీనియర్ పోలీస్‌గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళికి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బానే చేశాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ML రాజా నేపథ్య సంగీతం, పరవస్తు దేవేంద్ర సూరి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి.


