స్పెయిన్‌లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది.
బిల్లార్డా అంటే ఏమిటి..?
ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు.
ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది.
ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్‌గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది.


