తౌషిక్ (ఫైల్), పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు
ఉరేసుకుని చనిపోయాడని చెబుతున్న పాఠశాల యాజమాన్యం
తమ కుమారుడిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయలో ఘటన
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో శనివారం రాత్రి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాలు.. కనిగిరికి చెందిన సయ్యద్ ఆలీ, భార్య మౌలాబికి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు తౌషిక్(11) మూలగుంటపాడులోని శ్రీచైతన్య నవోదయలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల వార్డెన్ బాబ్జి తరుచూ తౌషిక్‌ను కొడుతుండటంతో.. కరస్పాండెంట్ రమణారెడ్డికి విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వార్డెన్ బాబ్జి సెల్‌ఫోన్ నుంచి తౌషిక్ తన తల్లి మౌలాబితో ఆనందంగా మాట్లాడాడు. ఆ తర్వాత అరగంటకే పాఠశాల నిర్వాహకుల నుంచి తౌషిక్ తల్లిదండ్రులకు ఫోన్ వచి్చంది.
మీ కుమారుడు బాత్రూంలో టవల్‌తో ఉరేసుకున్నాడని.. కందుకూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేసి వెళ్లిపోయారంటూ తౌషిక్ తల్లిదండ్రులు విలపించారు. తన సెల్‌ఫోన్‌ను ఉపయోగించినందుకు వార్డెన్ బాబ్జి కొట్టడంతో తౌషిక్ స్పృహ తప్పి పడిపోయాడని సహ విద్యార్థులు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల నిర్వాహకులు మాత్రం తౌషిక్ బాత్రూంలోని హ్యాంగర్‌కు ఉరేసుకొని చనిపోయాడంటున్నారని వాపోయారు.
ఆ హ్యాంగర్ పిల్లల చేతికి అందే ఎత్తులో ఉందని.. దానికెలా ఉరేసుకొని చనిపోతాడంటూ వారు ప్రశి్నంచారు. గొంతుపై గాట్లు ఎందుకున్నాయని నిలదీశారు. తమ కుమారుడిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ఆలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం తౌషిక్ మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ధర్నా చేశారు. కరస్పాండెంట్ రమణారెడ్డి, ఆయన కుమారులిద్దరూ పరారయ్యారని తెలియడంతో.. పాఠశాలపై దాడి చేసి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఎస్సై బి.మహేంద్ర పాఠశాల వద్దకు చేరుకొని.. వారికి నచ్చజెప్పి పంపించేశారు.


