ముక్కంటీ.. మనసాస్మరామీ | Maha Shivaratri celebrations in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ముక్కంటీ.. మనసాస్మరామీ

Feb 16 2026 4:43 AM | Updated on Feb 16 2026 4:43 AM

Maha Shivaratri celebrations in Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పంచాక్షరీ మంత్రం  

అత్యంత భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు  

లింగోద్భవ వేళ తన్మయత్వంతో పులకించిన భక్తులు  

దేవదాయ శాఖ వీఐపీల సేవలో తరించడంతో సామాన్యులకు ఇక్కట్లు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: సృష్టి లయకారకుడు పరమేశ్వరుని సన్నిధిలో పంచాక్షరీ మంత్రం మార్మోగింది. ఓం నమః శివాయ... హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయారు. లింగోద్భవ వేళ మహాదేవుని తనివితీరా దర్శించుకుని భక్తిపారవశ్యంతో ఉప్పొంగిపోయారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తుల కోలాహలంతో సందడిగా కనిపించాయి.

శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహానంది, పిఠాపురం పాదగయతోపాటు పంచారామాలుగా పిలుచుకునే దాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఆదివారం వేకువ­జాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. అయితే భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడం కంటే వీఐపీల సేవకే దేవదాయ శాఖ అధికారులు, సిబ్బంది ప్రాధాన్యమివ్వడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో అధికారులను భక్తులు నిలదీయడంతో ఘర్షణ చోటు చేసుకుంది.   

భక్తజన సంద్రంగా పాదగయ క్షేత్రం: కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, కుక్కుటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది. 

వాయులింగేశ్వరుని దర్శనంతో తన్మయత్వం 
శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో వాయులింగేశ్వరుని దివ్య తేజస్సును వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లు ఆదివారం ఉదయం ఇంద్ర విమానం, చప్పర వాహనాలపై, రాత్రి నంది, సింహ వాహనాలపై పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక స్వామి వారి లింగోద్భవ (నిజరూప) దర్శనానికి భక్తులు రాత్రంతా జాగారం చేశారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రథోత్సవం, రాత్రి పట్టణంలోని నారద పుష్కరణిలో శివపార్వతుల తెప్పోత్సవం నిర్వహించనున్నారు.  

మరోవైపు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించడంతో సర్వదర్శన క్యూలైన్లలో గంటల తరబడి సామాన్య భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. చంటి బిడ్డల తల్లులు తోపులాటల్లో ఇబ్బంది పడ్డారు. ఆలయ ఈవో, చైర్మన్‌కు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.  

శ్రీశైల మల్లన్నకు వైభవంగా పాగాలంకరణ 
మహా శివరాత్రి పర్వదినాన మల్లికార్జునస్వామి ఆలయంపై వైభవంగా పాగాలంకరణ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మీకుడు పృధ్వీ సుబ్బారావు పాగాలంకరణ చేశారు. పండితులు, ప్రధాన అర్చకులు శా్రస్తోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. వెంటనే పృధ్వీ సుబ్బారావు స్వామి వారి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖ మండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక వేదికపై అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన ప్రబోత్సవం కనుల పండువగా సాగింది.  

వైష్ణవ క్షేత్రంలో శివరాత్రి పూజలు: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవ దేవాలయం అయినప్పటికీ ఏటా శివరాత్రికి లక్షలాది భక్తులు హాజరై పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాక్షాత్తు శ్రీరాముడే రామక్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారని విశ్వసించిన భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు.  

⇒ కనులపండువగా యనమలకుదురు ప్రబోత్సవం 
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ప్రబోత్సవం కనుల పండువగా సాగింది. ప్రభలను తిలకించేందుకు, స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో యనమలకుదురులోని వీధులన్నీ రద్దీగా మారాయి.  

ప్రభల వైభవం... భక్తుల కోలాహలం  
వైభవంగా కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం  
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తజనంతో కిటకిటలాడింది. లక్షలాది భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో కోటప్పకొండ శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు బిందె తీర్థంతో స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. త్రికూటాద్రి పర్వతంపై కొలువై ఉన్న మహానందీశ్వరునికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు.  

23 భారీ విద్యుత్‌ ప్రభలతో సందడి   
కోటప్పకొండ ప్రభల ఉత్సవం భక్తుల సందడి మధ్య కోలాహలంగా సాగింది. 23 భారీ విద్యుత్‌ ప్రభలతోపాటు చిన్న చిన్న ప్రభలన్నీ ప్రభల నిధికి చేరాయి. కోటప్పకొండకు చేరే క్రమంలో భక్తులు ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం పెట్లూరివారిపాలెం వద్ద గంటకు పైగా ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వందలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. చిలకలూరిపేట యూటీ జంక్షన్‌ వద్ద మధ్యాహ్నం వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.   

అమరావతి శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో, రెంటచింతల మండలంలోని సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామిని, గురజాల మండల పరిధి దైద గ్రామ కృష్ణా నది తీరాన వేంచేసియున్న అమరలింగేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement