ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు
కస్టమ్ మిల్లెడ్ రైస్‌లో కమీషన్లకు కక్కుర్తి
రూ.80 కోట్ల ముడుపులకు ఓ మంత్రి పక్కా స్కెచ్
మరో కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా అమలు
ముక్కు పిండి వసూలు చేస్తున్న అసోసియేషన్లు
క్వింటాకు రూ.16 ఇవ్వాల్సిందేనని హుకుం
ప్రభుత్వం ఇచ్చేదే రూ.10 అయితే అంత కమీషన్ అంటే ఎలా అంటున్న మిల్లర్లు
అలాగైతే నూక, తవుడు మాటేంటని దబాయింపు
కాదంటే బిల్లుల్లో ఇబ్బందులు, కోత తప్పదని హెచ్చరిక
వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్న అమాత్యుని వియ్యంకుడికి, మరో మిల్లర్‌కు కమీషన్ మినహాయింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: రైస్ మిల్లర్లకు ఊహించని రీతిలో కష్టం వచ్చి పడింది. తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వంలో కీలక మంత్రులు ఇద్దరు ఫిక్స్ చేసేశారు. చెప్పినట్లు చేయాల్సిందేనని, లేదంటే తిప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేశారు. ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగింది అడిగినట్లు ముట్టజెప్పుతున్నారు. సీజనల్‌గా రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపి (సీఎంఆర్– కస్టమ్ మిల్లెడ్ రైస్), బియ్యంగా మార్చి తీసుకుని.. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు క్వింటాకు రూ.16 చొప్పున మామూళ్లు ఇచ్చేలా రేట్ ఫిక్స్ చేసింది. గతేడాది బిల్లులు మంజూరు కోసం ముడుపులు మెక్కిన అమాత్యుడు ఈసారి మరో అడుగు ముందుకేసి సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లపై పడి కోట్లు దండుకోవడానికి బరితెగించారు. కేబినెట్‌లో మరో కీలక మంత్రి కూడా ఇతనితో జత కలిశారు. ఇద్దరూ కూడబలుక్కుని.. కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. ఈ దందాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
2,280 మిల్లులపై ఒత్తిడి
ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఆర్) సేకరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమీషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాతి ఏడాది ప్రాధాన్యతనిస్తూ కోటా పెంచుతుంటారు. ఈ కేటాయింపు ప్రక్రియ ఏ జిల్లాకు ఆ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేపడుతుంటుంది. మిల్లింగ్ చేసే ధాన్యం పరిమాణాన్ని బట్టి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. అనంతరం మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తారు. ఇలా సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీకి కేటాయిస్తుంది. ఈ మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, మిల్లర్ల మధ్య మూడు నెలల కాలానికి ఒప్పందం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,280 మిల్లుల్లో దాదాపు చిన్న తరహా మిల్లులన్నీ మూడు నెలలపాటు సీఎంఆర్‌పైనే నడుస్తున్నాయి. మిగిలిన తొమ్మిది నెలలు దాదాపు ఖాళీగానే ఉంటాయి.
అదనపు ఆదాయం వస్తుందనుకుంటే..
గతేడాది కంటే ఈ ఏడాది 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించడంతో మిల్లర్లు అదనపు ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. సీఎంఆర్ అదనపు కోటాతో ఈ ఏడాది అదనంగా పని దొరుకుతుందని పడ్డ సంబరం కాస్తా ఒక మంత్రి దోపిడీ ప్లాన్‌తో తల్లకిందులైంది. సీఎంఆర్‌కు అనుమతి పొందిన మిల్లర్లు మంత్రికి ముడుపులు మూటగట్టి ఇవ్వాలని అసోసియేషన్‌ల ద్వారా ఆదేశాలు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. సీఎంఆర్ ద్వారా మిల్లింగ్ చేసే ప్రతి క్వింటా బియ్యానికి రూ.16 వంతున కమీషన్‌ను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరిస్తోన్న 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై రూ.80 కోట్లు ముడుపులు (కొందరికి మినహాయింపు ఇవ్వడం వల్ల.. లేదంటే మరింత పెరుగుతుంది) ముట్ట చెప్పేందుకు వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే 60–70 శాతం మిల్లుల నుంచి వసూలు చేసేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారు ఈ నెలాఖరు లోపు చెల్లించాలంటూ ఆయా జిల్లాల్లో అసోసియేషన్‌ల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. 
కస్టమ్ మిల్లింగ్ రైస్
మంత్రి వియ్యంకుడా.. మజాకా!
⇒ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ అనుమతించిన మిల్లుల నుంచి ముడుపులు మెక్కడానికి స్కెచ్ వేసిన అమాత్యుడు.. తన దందా సవ్యంగా సాగేందుకు సహచర కీలక మంత్రిని కలుపుకున్నారు. ఈ కీలక మంత్రి వియ్యంకుడిది బియ్యం వ్యాపారంలో అందె వేసిన చెయ్యి. దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో అపార అనుభవం గడించారు. సొంతంగా మిల్లులు కూడా ఉన్నాయి. ఇతన్ని అడ్డుగా పెట్టుకుని కమీషన్ల దందా నడుపుతున్నారు.
⇒ ఈ క్రమంలో సదరు మంత్రి వియ్యంకుడి మిల్లుతో పాటు అతని సహచరుడైన మరో బడా ఎక్స్‌పోర్టర్ మిల్లులకు కమీషన్‌లో మినహాయింపు ఇవ్వడం అసోసియేషన్‌లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వియ్యంకుడైన గోదావరి జిల్లాలకు చెందిన బడా ఎక్స్‌పోర్టర్‌కు, మరో బడా ఎక్స్‌పోర్టర్ తోడై కమీషన్‌ల బాగోతాన్ని చక్కబెడుతున్నారు. ఇందుకు కమీషన్‌లో మినహాయింపుతో పాటు తొలిసారి సీఎంఆర్ కోటా దక్కించుకున్నారు.
⇒ వాస్తవానికి మిల్లర్లకు జిల్లా స్థాయిలోనే మిల్లర్ల అసోసియేషన్ సీఎంఆర్ కోటా కేటాయిస్తుంటుంది. అటువంటిది అసోసియేషన్ ప్రమేయం లేకుండానే ఈ రెండు బడా రైస్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలు నేరుగా ఉన్నత స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి సీఎంఆర్ అనుమతి తెచ్చుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు నష్టపోయిన రైతుల నుంచి బస్తా ధాన్యం కొనుగోలు చేసిన చరిత్ర లేని ఈ కంపెనీలకు ప్రభుత్వం పెద్ద పీట వేయడం చర్చనీయాంశమైంది.
⇒ సీఎంఆర్‌కు ఏ జిల్లాలో పండించిన ధాన్యాన్ని ఆ జిల్లాలోనే అనుమతిస్తారు. కానీ మంత్రి వియ్యంకుడు కావడంతో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి పొరుగున కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేక అనుమతి ఇచ్చారని సమాచారం. మంత్రి వియ్యంకుడికి 65 వేల టన్నులు, మరో బడా రైస్ ఎక్స్‌పోర్టర్‌కు 25 వేల టన్నులు సీఎంఆర్‌కు అనుమతించారు. ఇది ఆ జిల్లా మొత్తం సీఎంఆర్‌లో మూడింట (మూడు లక్షల టన్నులు) ఒక వంతు కావడం గమనార్హం.
సారూ.. ‘సీజ్ ద కమీషన్స్’ అనండి
ఏడాది క్రితం పేదల బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి పోతున్నాయని ‘సీజ్ ద షిప్’ అంటూ హడావిడి చేసిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడేం చేస్తున్నారని ఈ సందర్భంగా మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ కోసం సేకరిస్తోన్న సీఎంఆర్‌లో ఇంతలా బరితెగించి కమీషన్లు వసూలు చేస్తుండటం మీ దృష్టికి రాలేదా అని నిలదీస్తున్నారు. ఈ విషయమై ఆయన స్పందించకపోతే, ఈ దందాలో ఆయనకూ వాటా ఉన్నట్లేనని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ‘సీజ్ ద కమీషన్స్’ అంటూ ఈ కమీషన్లకు బ్రేక్ వేయాలని కోరుతున్నారు.
సీజన్ మొదట్లోనే స్కెచ్.. ఇప్పుడు అమలు
⇒ సీఎంఆర్ విధానంలో అమాత్యునికి కమీషన్ విషయమై సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలో చర్చించారు. నాటి సమావేశంలో పలువురు ప్రతినిధులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయమై మిల్లర్లు రోడ్డెక్కితే అల్లరై బియ్యం సేకరణకు ఆదిలోనే ప్రతిబంధకం ఎదురవుతుందని అప్పట్లో మిన్నకుండిపోయారు.
⇒ సీఎంఆర్ కేటాయింపు ప్రకారం 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో కమీషన్ వసూలుకు ఇదే తరుణమని స్కెచ్ వేశారు. క్వింటాల్‌కు రూ.16 వంతున కమీషన్ చెల్లించాల్సిందేనంటూ అసోసియేషన్ ద్వారా మిల్లర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
⇒ సీఎంఆర్ చివర్లో ఉన్న తరుణంలో అడిగినంత కమీషన్ ఇచ్చుకోక తప్పని పరిస్థితుల్లో మిల్లర్లు వెనక్కు పోయేది ఉండదు. అదే ధైర్యంతో గత పక్షం రోజులుగా కమీషన్ల వసూళ్ల దందాను మరింత ముమ్మరం చేశారు. కమీషన్ ఇవ్వకుంటే సీఎంఆర్ బిల్లుల్లో కోతలు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. క్వింటాకు ప్రభుత్వం ఇచ్చేది రూ.10. సంచులు, నూకలు, తౌడు వంటి వాటిపై కొంత ఆదాయం వచ్చే మాట నిజమైనా, ఏకంగా రూ.16 కమీషన్ చెల్లించాలనడం భావ్యం కాదని మిల్లర్లు వాపోతున్నారు. ఇంత కమీషన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో తొమ్మిది నెలలు మూతేసుకుని కూర్చుంటున్న మిల్లులకు సీఎంఆర్‌తో మూడు నెలలు పని దొరుకుతుందనుకుంటుంటే మెడపై కత్తిపెట్టి కమీషన్ వసూలు చేయడం దారుణం అని, ఇదేం మంచి ప్రభుత్వం? అని మిల్లర్లు నిలదీస్తున్నారు.
⇒ కమీషన్ ఇచ్చుకోలేమని ఎదురు తిరుగుతున్న మిల్లర్లకు సీఎంఆర్ బిల్లులు ఎలా మంజూరు అవుతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా మంత్రుల కోసం కమీషన్లు వసూలు చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే 90 శాతం వసూళ్లు పూర్తయ్యాయని సమాచారం. ప్రభుత్వ ముఖ్య నేతలకు బాగా తెలిసిన వారికి కమీషన్‌లో కొంత మినహాయింపు ఇచి్చనట్లు తెలిసింది.


