అలల ఉధృతికి కొట్టుకుపోయిన బీటెక్ విద్యార్థి మృతి
మృతుడి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి
కొమ్మాది (విశాఖ): మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా గడపాలని సంద్రానికి వెళ్లిన స్నేహితులకు విషాదం మిగిలింది. అలల తాకిడికి కొట్టుకుపోయి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కొమ్మాది గాయత్రీ విద్యాపరిషత్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నానాలు ముగించుకుని రాడిసన్ బ్లూ వెనుక వైపు ఉన్న తీరానికి వెళ్లారు.
అరవింద్ నాయుడు (21) మళ్లీ సముద్రంలోకి దిగగా, అలల ఉధృతికి ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు గోకులకృష్ణ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గమనించిన లైఫ్ గార్డ్స్ బోటులో వెళ్లి గోకుల కృష్ణను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అరవింద్‌కు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. అరవింద్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామం. అతని తండ్రి సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసునమోదు చేశారు.


