నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ | Two helicopters collide in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ

Nov 4 2026 5:11 AM | Updated on Nov 4 2026 5:11 AM

Two helicopters collide in Nepal

ల్యాండయ్యే సమయంలో ఒకదానినొకటి ఢీకొంటున్న హెలికాప్టర్లు

భారతీయుడు మృతి

కాఠ్మండు: నేపాల్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. హెలిప్యాడ్‌పై ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారతీయుడు వసంత్‌ కుమార్‌ బలరాముడు (47) మృతి చెందారు. భారత సంతతికి చెందిన 53 ఏళ్ల న్యూజిలాండ్‌ పౌరుడు శైలేష్‌ కిషన్‌ పటేల్‌ గాయపడ్డారు. మంగళవారం ఉదయం 8.10 గంటల సమయంలో సోలుఖుంబు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వసంత్‌ మృతదేహాన్ని హెలికాప్టర్‌ ద్వారా లుక్లాకు తరలించారు. గాయపడిన ఏళ్ల శైలేష్‌ కిషన్‌ పటేల్‌ను మరో హెలికాప్టర్‌లో వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో పైలట్లు, ఫిష్‌టెయిల్‌ ఎయిర్‌కు చెందిన రవీంద్ర ప్రజాపతి, డైనస్టీ ఎయిర్‌కు చెందిన ప్రజ్జ్వల్‌ కేసీ కూడా గాయపడ్డారు.

వారిని తదుపరి చికిత్స కోసం కాఠ్మండుకు తరలించారు. ఫిష్‌టెయిల్‌ ఎయిర్, డైనాస్టీ ఎయిర్‌ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ఫెరిచే హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నించాయని, ఈ క్రమంలో రెండు హెలికాప్టర్ల రోటర్‌ బ్లేడ్లు ఒకదానికొకటి తగలడంతో ప్రమాదం జరిగిందని నేపాల్‌ పౌర విమానయాన ప్రాధికార సంస్థ తెలిపింది. డైనస్టీ ఎయిర్‌ హెలికాప్టర్‌ సరుకును తీసుకువెళుతోంది.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ప్రమాదం జరిగిన సమయంలో రెండు హెలికాప్టర్లలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఫెరిచే, కాఠ్మండుకు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో, మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు వెళ్లే మార్గంలో ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకొచ్చాయి. అత్యంత సమీపానికి వచి్చన హెలికాప్టర్ల రోటర్‌ బ్లేడ్లు ఢీకొన్న దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కాగా, నేపాల్‌లో పర్యాటకులు, పర్వతారోహకుల రవాణా, పర్వత ప్రాంతాలకు సరుకులు చేరవేయడం, ఇతర అత్యవసర సహాయక చర్యలు, రెస్క్యూ ఆపసరేషన్ల కోసం హెలికాప్టర్లు ఉపయోగిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement