ట్రంప్‌ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను | Donald Trump White House UFC show sparks fresh political storm | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను

May 28 2026 12:21 PM | Updated on May 28 2026 12:36 PM

Donald Trump White House UFC show sparks fresh political storm

అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తాజా ప్రతిపాదన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వైట్‌హౌస్‌లో UFC (మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) ఫైట్‌ నిర్వహించాలన్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. అధ్యక్ష భవనం ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఏంటని? ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసలది అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల కోసమా? లేక ట్రంప్‌ పుట్టినరోజు నేపథ్యంలోనా? అన్న గందరగోళం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. 

యూఎఫ్‌సీ విడుదల చేసిన ప్రారంభ ప్రణాళికల్లో వైట్‌హౌస్‌ ప్రాంగణంలో ప్రత్యేక “లెగసీ ఫైట్‌ నైట్‌” నిర్వహించాలన్న సూచన ఉంది. అయితే కొన్ని నివేదికలు ఈ ఈవెంట్‌ను ట్రంప్‌ పుట్టినరోజు(జూన్‌ 14) చుట్టూ ప్లాన్‌ చేస్తున్నారన్న సంకేతాలు ఇవ్వడంతో, దీనిపై డెమొక్రటిక్‌ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. “అమెరికన్‌ స్పోర్ట్స్‌ షోకేస్‌”గా దీన్ని ప్రదర్శించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టత లేకుండా మారింది. 

వైట్‌హౌస్‌ దక్షిణ లాన్‌ ప్రాంతంలో తాత్కాలిక భారీ ఆక్టగాన్‌ రింగ్‌, వీఐపీ గ్యాలరీలు, మీడియా బాక్స్‌లు ఏర్పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రేక్షకులను అనుమతించే స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రసారాల కోసం భారీ సెట్‌ అప్‌ అవసరమని అంచనా. భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్‌ సర్వీస్‌ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆపరేషన్‌గా ఇది మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఖర్చుపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. 

ప్రారంభ అంచనాల ప్రకారం.. ఈ ఈవెంట్‌ కోసం దాదాపు 60 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.500 కోట్లకు పైగా) వరకు ఖర్చవొచ్చని అమెరికన్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే వైట్‌హౌస్‌ లాన్‌ దెబ్బతినడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి మాత్రమే దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చవుతుందని స్వయంగా యూఎఫ్‌సీ అధ్యక్షుడు డానా వైట్‌ వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి

అమెరికాలో పెరుగుతున్న ద్రవ్య లోటు, ప్రజా వ్యయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి “ఎంటర్టైన్‌మెంట్‌ ప్రాజెక్ట్‌” అవసరమా? అనే ప్రశ్న డెమొక్రాట్లు గట్టిగా లేవనెత్తుతున్నారు. “ట్రంప్‌ దుబారా ప్రాజెక్ట్‌”గా విమర్శిస్తున్నారు. వైట్‌హౌస్‌ అనేది పరిపాలనా కేంద్రం తప్ప వినోద వేదిక కాదని, అక్కడ పోరాట క్రీడల కోసం భారీ ఈవెంట్లు నిర్వహించడం అధ్యక్ష పదవికి తగదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇది పాలన కాదు.. పబ్లిసిటీ షో” అని కొందరు నేతలు ఘాటుగా విమర్శించారు. 

ఇక రిపబ్లికన్‌ వర్గాల్లో మాత్రం ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన ఉంది. కొందరు దీనిని అమెరికా 250 ఏళ్ల వేడుకలను ప్రపంచానికి చూపించే అవకాశంగా చూస్తుండగా.. మరికొందరు ఇది అనవసర రాజకీయ వివాదాలకు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో చూస్తే వైట్‌హౌస్‌ ప్రాంగణంలో ఇలాంటి పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగలేదు. సాధారణంగా అధికారిక వేడుకలు, చిన్న స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే అక్కడ నిర్వహించబడతాయి. అంతర్జాతీయ స్థాయి ఫైట్‌ ఈవెంట్‌ మాత్రం వైట్‌హౌస్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. ఇదే సమయంలో..

ట్రంప్‌ ఆధ్వర్యంలో వైట్‌హౌజ్‌లో కొన్ని నిర్మాణ మార్పులు కూడా జరుగుతున్నాయన్న వార్తలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సమావేశ హాళ్ల ఆధునీకరణ, ఈవెంట్‌ స్పేస్‌ల విస్తరణ, భద్రతా మౌలిక సదుపాయాల మార్పులతో పాటు భారీ “బాల్‌రూమ్‌” నిర్మాణ ఆలోచన కూడా ఇందులో భాగంగా ఉండడం తెలిసిందే. అయితే.. అంతర్జాతీయ స్థాయి విందులు, భారీ రాజకీయ–సామాజిక ఈవెంట్లు నిర్వహించేందుకు అనువుగా ఈ మార్పులు చేపడుతున్నారన్న చర్చ సాగుతోంది. డెమొక్రాట్లు మాత్రం “వైట్‌హౌస్‌ను పరిపాలనా కేంద్రం నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికగా మార్చేస్తున్నారు” అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏది ఏమైనా ట్రంప్‌ మాత్రం తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. యూఎఫ్‌సీ ఈవెంట్‌ను “గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌”గా అభివర్ణిస్తూ భారీ ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు యూఎఫ్‌సీ అధ్యక్షుడు డానా వైట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ ఫైట్‌ ప్లాన్‌ను చాలామంది “రాజకీయ బ్రాండింగ్‌ ఈవెంట్‌”గా చూస్తున్నారు.

ఏంటీ ఫైట్‌?
యూఎఫ్‌సీ.. “అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌”. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (MMA) పోటీ సంస్థ. బాక్సింగ్‌, రెజ్లింగ్‌, జూడో, కరాటే, జియూ-జిట్సు వంటి పలు యుద్ధ కళలను కలిపి జరిగే పోరాటాలను ఇందులో నిర్వహిస్తారు. అమెరికాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు గ్లోబల్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌గా ఎదిగింది. ఆక్టగాన్‌ అనే ఎనిమిది కోణాల రింగ్‌లో ఫైటర్లు తలపడటం యూఎఫ్‌సీ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ పోటీలను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇది కేవలం క్రీడ మాత్రమే కాకుండా భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బిజినెస్‌ ఇండస్ట్రీగా కూడా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement