తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి | Revanth Reddy Orders Medigadda Restoration: Telangana | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి

Nov 6 2026 5:16 AM | Updated on Nov 6 2026 5:16 AM

Revanth Reddy Orders Medigadda Restoration: Telangana

మేడిగడ్డ నీళ్ల ఎత్తిపోతల అంశంపై మంత్రులకు సీఎం ఆదేశం

డిసెంబర్‌లోగా బరాజ్‌ల పునరుద్ధరణ పనులు ప్రారంభించాలన్న రేవంత్‌రెడ్డి  

దిగువ గోదావరి జలాల వినియోగాన్ని పెంచినట్టు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బరాజ్‌ వద్ద నీళ్లున్నా వాటిని ఎత్తిపోయడం లేదనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను సురక్షితంగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సచివాలయంలో మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బరాజ్‌ వద్ద ఉన్న నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మేడిగడ్డ నుంచి లిఫ్ట్‌ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే మార్గమధ్యంలో ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నిర్మాణ లోపాలున్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లను తెరిచే ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం అన్నారు.

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ)తో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బరాజ్‌ల భద్రతపై రాజీ పడకుండా వేగంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అనుమతులను త్వరితగతిన పొందేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 

రూ.4,193 కోట్లతో పునరుద్ధరణ అంచనాలు 
మూడు బరాజ్‌ల పునరుద్ధరణ ప్రణాళికను ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, అధికారులు వివరించారు. బరాజ్‌లలోని లోపాలపై జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థలతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని చెప్పారు. మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

నిర్మాణ లోపాలను సరిదిద్దేందుకు అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభు త్వం భరించేలా ప్రతిపాదించినట్లు వివరించారు. కాగా పనుల్లో జాప్యం జరగకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. పునరుద్ధరణ పనులకు తుది అనుమతులను నెలాఖరులోగా పొందేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించాలన్నారు. బరాజ్‌ల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.  

దేవాదుల, సీతారామతో భారీగా ఎత్తిపోతలు
దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్‌ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీటిని అందించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేస్తే, గత మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే 89 శాతం అధికంగా గోదావరి నీటిని వాడుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్‌ అండ్‌ సేఫ్టీ కార్యదర్శి కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement