న్యూఢిల్లీ: పెట్రోలియం లైసెన్స్ నిబంధనలకు సంబంధించి సాధారణ ఉల్లంఘనలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించి భారీ జరిమానాలు విధించేలా కేంద్రం కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. అయితే, ప్రజా భద్రత, కీలకమైన మౌలిక సదుపాయాలకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలు, అనధికారిక పెట్రోలియం కార్యకలాపాలు మాత్రం క్రిమినల్ నేరాల కిందే కొనసాగనున్నాయి. పెట్రోలియం చట్టం 1934ని మార్చేందుకు ఉద్దేశించిన సవరణల ముసాయిదాలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.
ప్రతిపాదిత సవరణలను ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ప్రజలు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన విషయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కాకుండా అడ్మిని్రస్టేటివ్ వ్యవస్థ కింద చర్యలు ఉంటాయి. తొలిసారిగా ఉల్లంఘిస్తే నిర్దిష్ట అధికారి రూ. 2.5 కోట్ల వరకు సివిల్ పెనాల్టీ విధించవచ్చు. పదే పదే ఉల్లంఘిస్తే ఇది రూ. 5 కోట్ల వరకు పెరుగుతుంది. తీవ్రతను బట్టి ఆంక్షలు విధించేందుకు లేదా లైసెన్సును రద్దు చేసేందుకు కూడా అధికారి సిఫార్సు చేయొచ్చు.
లైసెన్సు లేకుండా అనధికారికంగా పెట్రోలియం కార్యకలాపాలు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మోసపూరితంగా లైసెన్సు తీసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. కీలక పెట్రోలియం మౌలిక సదుపాయాలు దెబ్బతినేందుకు కారణమైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. 1970 నుంచి ఈ చట్టాన్ని మార్చలేదు.


