బనశంకరి: బెంగళూరు సమీపంలోని హొసకోటెలో తెల్లవారకుండానే వేడి వేడి దొన్నె దమ్ బిర్యానీ తినడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి బైక్‌లు, కార్లలో వేలాదిగా వస్తుంటారు. దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరిగి గొడవలు, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని పరిష్కారానికి తెల్లవారుజామున 4 గంటలకు బదులు ఉదయం 6 గంటలకు హోటళ్లు తెరవాలని పోలీసులు ఆదేశించినా పెద్దగా పట్టించుకోవడం లేదు.
పార్కింగ్ గొడవలు
ఇటీవల మణి దమ్ బిర్యాలీ సెంటర్ వద్ద ఓ టీవీ నటి కారు పార్కింగ్ విషయంలో గొడవపడి దాడులకు దిగారు. పోలీసు స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. పైగా హోటళ్ల పరిసరాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. మద్యం తాగుతూ రభస చేయడం వల్ల స్థానిక మహిళలు, పిల్లలకు ఇబ్బందిగా ఉంటోందని ఆరోపణలున్నాయి.
ఉదయం 6 నుంచి: సీఐ
నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ గోవింద్, బిర్యానీ హోటల్స్‌కు నోటీసులు జారీ చేశారు. 6 గంటలకు రావడం ఇబ్బందిగా ఉంటోంది, కనీసం 5 గంటల నుంచి అనుమతించాలని బిర్యాని ప్రియులు కోరారు.


