పట్టభద్రుల పోరులో బీఆర్‌ఎస్ సామాజిక సమీకరణాల లెక్కలు
‘హైదరాబాద్’కు బీసీ అభ్యర్థి వైపు కేసీఆర్, కేటీఆర్ మొగ్గు?
కాసాని వీరేశ్, నాగేందర్‌గౌడ్ సహా పలువురి పేర్లు పరిశీలనలో
వరంగల్ బరిలో రాకేశ్‌రెడ్డికి మరోసారి అవకాశం దక్కినట్టే !
నేడో రేపో పార్టీ అభ్యర్థుల పేర్లపై బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్‌ఎస్ సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోనుంది. వచ్చే ఏడాది మార్చిలో ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం ముగియనుంది. ఈ రెండు స్థానాల్లో ఒకటి ఓసీ, మరొకటి బీసీ సామాజికవర్గానికి కేటాయించాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అధికార కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్‌ఎస్ కూడా ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. బీజేపీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను సైతం దృష్టిలో పెట్టుకొని వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్‌పై రాజకీయంగా ఒత్తిడి పెంచొచ్చని భావిస్తున్నట్టు సమాచారం.
రాకేశ్‌రెడ్డికి గ్రీన్‌సిగ్నల్.. !
‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం’నుంచి గత ఉప ఎన్నికలో పోటీ చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024 మేలో జరిగిన ఉపఎన్నికలో లక్షకుపైగా ఓట్లు సాధించి, చివరి వరకు గట్టి పోటీ ఇవ్వడం ఆయనకు టికెట్ కేటాయింపులో అనుకూల అంశంగా మారింది. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఏర్పడిన పరిచయాలు, గత ఎన్నికల అనుభవం నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఇటీవల ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు సంకేతాలిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానానికి కాంగ్రెస్ ఇప్పటికే రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాకేశ్‌రెడ్డిని మరోసారి బరిలోకి దించడం ద్వారా గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను నిలబెట్టుకోవడంతోపాటు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చవచ్చని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. అయితే ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాతే రెండు స్థానాల అభ్యర్థుల పేర్లను కలిపి నేడోరేపో అధికా రికంగా ప్రకటించే అవకాశముంది.
బీసీ అభ్యర్థి కోసం అన్వేషణ
‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానానికి బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే అంశంపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న నాగేందర్‌గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేరును కూడా నాయకత్వం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజికవర్గం కోణాన్ని పక్కన పెడితే స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరికొందరు పార్టీ నేతల పేర్లపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


