పాదరసాన్ని బంగారం చేశా!  | Rajasthan startup claims it turned mercury into gold | Sakshi
Sakshi News home page

పాదరసాన్ని బంగారం చేశా! 

Oct 29 2026 6:19 AM | Updated on Oct 29 2026 6:19 AM

Rajasthan startup claims it turned mercury into gold

లాల్‌ బహదూర్‌ అనే శాస్త్రవేత్త ప్రకటన 

ఉపరితలంపై 23.77 క్యారెట్ల బంగారం 

కొంత వెండి, రాగి కూడా.. మరిన్ని పరీక్షల్లో నిర్ధారణైతేనే నమ్మకం

న్యూఢిల్లీ: సాధారణ లోహాలను బంగారంగా మార్చాలన్న ఆశ ఈనాటిది కాదు... సైన్స్‌ అంతగా అభివృద్ధి చెందని కాలంలో చాలామంది ఈ వరుసవేది విద్యతో బంగారాన్ని సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త ఇప్పుడు తాను పాదరసాన్ని బంగారంగా మార్చానని ప్రకటించడంతో వరుసవేది విద్య మరోసారి చర్చలోకి వచ్చింది. 

తాను కూడా ప్రాచీన భారతీయ రసాయన శాస్త్ర పద్దతుల స్ఫూర్తితోనే ఈ ఘనతను సాధించానని చెబుతూండటం గమనార్హం. అయితే... ఆధునిక శాస్త్ర పద్ధతుల్లో దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.  భారతదేశం నిర్వహించిన ప్రోఖాన్‌–2 అణుపరీక్షలు గుర్తుండే ఉంటాయి. వీటిల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తానని లాల్‌బహదూర్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. పాదరసాన్ని బంగారంగా మార్చానని చెబుతున్నది కూడా ఈయనే. 

జైపూర్‌లని కనోడియా కాలేజీలో 0.240 గ్రాముల పాదరసాన్ని  ప్రయోగాలు నిర్వహించామని, ఉపరితలంపై 99.04 శాతం బంగారం ఉన్నట్లు పరీక్షల ద్వారా తెలిసిందని ఆయన చెబుతున్నారు. ఇది 23.77 క్యారెట్ల బంగారంతో సమానమన్నది అంచనా. అంతేకాకుండా.. ఉపరితలంపై 0.48 శాతం చొప్పున రాగి, వెండి కూడా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వివరించారు. 

భారతీయ ‘రస శాస్త్రం’ ఆధారంగా ఈ ప్రయోగం జరిగిందని, పదరా సంస్కారం, ధాతు పరివర్తనం అనే పద్ధతులను ఉపయోగించానని చెప్పారు. ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన పుస్తకాల్లో ఈ పద్ధతి ఉందని బిట్స్‌ పిలానీ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన లాల్‌ బహదూర్‌ తెలిపారు. తాను తయారు చేసిన బంగారం, ఇతర లోహాల నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడటం లేదని చెప్పారు. 

నిజమేనా...? 
లాల్‌ బహదూర్‌ నిజంగానే పాదరసాన్ని బంగారం, వెండి, రాగిగా మార్చారా? శాస్త్రీయంగా నిర్ధారణ జరగాల్సి ఉంది. పరీక్ష ఫలితాలు ఉపరితలానికి సంబంధించినవి మాత్రమే కావడం గమనార్హం. ప్రయోగాల కోసం ఉపయోగించిన 0.240 గ్రాముల పాదరసం మొత్తం బంగారంగా మారిందా? అన్నది మరిన్ని పరీక్షలు చేస్తే కానీ స్పష్టం కాదు. ఉపరితలంపైని 99.04 శాతం బంగారం లెక్కల ప్రకారం 23.77 క్యారెట్ల నాణ్యత కలిగిందే. 

అలాగని మొత్తం శాంపిల్‌ ఇదే నాణ్యతతో ఉందా? అన్నది ప్రశ్న. అంతేకాకుండా.. ఉపరితలంపై బంగారాన్ని గుర్తించినంత మాత్రాన అది పాదరసం మారడం వల్లనే వచ్చిందని నిర్ధారణగా చెప్పలేము కూడా. విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తే శాంపిల్‌లో ముందుగానే కొంత బంగారం ఉందా? లేదా ఎక్కించారా? అన్నది తెలుస్తుంది. వీటన్నింటినీ తెలుసుకునేందుకు జైపూర్‌లోని మాలవ్యా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ త్వరలోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 

రాజస్థాన్‌లోని ఈసీహెచ్‌ సెంటర్‌లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు నిర్వహించారలని చెబుతున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో మరిన్ని ప్రయోగాలు నిర్వహించి పాదరసం నుంచి బంగారం ఉత్పత్తి అవుతుందని నిరూపించగలిగితే శాస్త్రీయంగా ఆ పద్ధతికి గుర్తింపు లభిస్తుంది. ఎక్స్‌–రే ఫ్లోరొసెన్స్, ఐసోటోప్‌ల విశ్లేషణల ద్వారా నమూనాలో ఉన్న మూలకాలు ఏమిటి? ఎంత మేరకు ఉన్నాయి? అన్న విషయాలను తెలుసుకోవచ్చు.  

వాస్తవానికి పాదరసం, బంగారం రెండూ వేర్వేరు లోహాలు. కాకపోతే వీటి అణు సంఖ్యలో తేడా ఒకటి మాత్రమే. పాదరసం అణుసంఖ్య 80 కాగా.. బంగారానిది 79. సాధారణ రసాయన చర్యల ద్వారా ఒకదాన్ని ఇంకోదానిగా మార్చడం అసాధ్యం. అణుకేంద్రక స్థాయిలో మార్పులు అవసరమవుతాయి. కాబట్టి లాల్‌ బహదూర్‌ చెబుతున్న విషయాలను స్వతంత్ర ప్రయోగాల ద్వారా నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే పాదరసం బంగారంగా మారగలదన్న విషయం రూఢి అవుతుంది.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement