సామాన్యులు ఓట్లు వేయకుండా అడ్డుకునేందుకు భారీ కుట్రలు
వంద మీటర్ల వరకే ఎన్నికల కమిషన్ పరిధి
ఆ బయట శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసు బాధ్యత
పోలీసుల అండతోనే తిష్టవేయనున్న టీడీపీ గంజాయి బ్యాచ్‌లు
పోలీసు యాక్ట్, ఇతర చట్టాలు బేఖాతరు చేస్తూ బరితెగింపు
వైఎస్సార్‌సీపీ, తటస్థ ఓటర్లను అడ్డుకునే కుట్ర
ఎన్నికల అక్రమాలకు టీడీపీ పెద్దల స్కెచ్
సీఎంవో, డీజీపీ కార్యాలయం వేదికగా కుట్రలకు పదును
క్షేత్రస్థాయిలో పోలీసుల వత్తాసు
పోలింగ్ కేంద్రాలను చుట్టుముట్టనున్న గంజాయి బ్యాచ్‌లు
సాక్షి, అమరావతి: పోలింగ్ తేదీలు సమీపిస్తున్న కొద్దీ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రం నారా వారి రాక్షస క్రీడగా మారుతోంది. సామాన్య ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి వెళితే.. కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే విషయం స్పష్టమవుతోంది. దాంతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు, టీడీపీ కూటమి పెద్దలు అక్రమాల కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. అసలు సామాన్య ఓటర్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించకుండా అల్లర్లు, అరాచకం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు.
పోలింగ్ కేంద్రాల చుట్టూ టీడీపీ రౌడీమూకలతోపాటు ప్రత్యేకించి గంజాయి బ్యాచ్‌లను మోహరించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు స్కెచ్ వేశారు. సీఎంవో, డీజీపీ కార్యాలయం కేంద్ర బిందువుగా ఈ కుట్రకు పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. ప్రశాంత పోలింగ్‌కు బాధ్యత వహించాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ పెద్దల రాజకీయ కుట్రలో పాత్రధారిగా మారుతోంది. అందుకోసం ఎన్నికల కమిషన్ నిబంధనల్లోని లొసుగులను అవకాశంగా చేసుకుంటూ.. చట్టాన్ని బరితెగించి ఉల్లంఘించి మరీ టీడీపీ పెద్దలు నడుపుతున్న కుతంత్రం రాష్ట్రంలో రాజకీయ రాక్షసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఆవల అంతా పచ్చ రౌడీలు.. గంజాయి గ్యాంగ్‌లు
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధి వరకు ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉంటుంది. ఓటరు స్లిప్పు ఉన్నవారిని మాత్రమే ఆ వంద మీటర్లు దాటి పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు అయితే వారికి సహాయంగా ఒకరిని వెళ్లనిస్తారు. అంతేతప్ప ఇతరులెవరూ ఆ వంద మీటర్ల పరిధిని నిర్దేశిస్తూ మార్క్ చేసిన గీతను దాటకూడదు. ఇదీ నిబంధన. అందుకే ఆ వంద మీటర్ల బయట మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని టీడీపీ పెద్దలు కుట్ర పన్నారు. అందుకోసం ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన రౌడీలు, అసాంఘిక శక్తులను మోహరించాలని నిర్ణయించారు.
అంతర్‌రాష్ట నేరస్తులు, రౌడీషీటర్లతోపాటు గంజాయి బ్యాచ్‌లను సమీకరిస్తోంది. టీడీపీ పెద్దల పన్నాగం ప్రకారం.. పోలింగ్ ప్రారంభానికి ముందే ఆ బ్యాచ్‌లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల బయట తిష్టవేస్తాయి. మద్యం సేవిస్తూ.. గంజాయి దమ్ము పీలుస్తూ ఆ ప్రాంతంలో అసాంఘిక పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తాయి. ఆ ఆకతాయి, గంజాయి గుంపులు ఓట్లు వేసేందుకు వచ్చే వైఎస్సార్‌సీపీ ఓటర్లు, తటస్థ ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటాయి. వారిని కవ్విస్తూ.. కించపరుస్తూ.. దుర్భాషలాడుతూ.. అవసరమైతే కొడుతూ మరీ ఆ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులకు విఘాతం కలిగిస్తాయి. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడాలని కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు సమాచారం.
అందుకోసం కర్రలు, కత్తులు, ఇతర ఆయుధాలతోసహా పోలింగ్ కేంద్రాల వద్ద తిష్ట వేయమన్నారు. తద్వారా పోలింగ్ కేంద్రాల చుట్టూ భీతావహ పరిస్థితులు సృష్టించాలన్నది ప్రభుత్వ పెద్దల లక్ష్యం. దాంతో వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్లు, తటస్థ ఓటర్లు అసలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకే వెనుకంజ వేసే అనివార్య పరిస్థితులను కల్పించాలన్నది ఉద్దేశం. ప్రధానంగా మహిళా, యువ ఓటర్లు ఎవరూ తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల విస్పష్ట ఆదేశం.
ఎందుకంటే.. 2024 ఎన్నికల సందర్భంగా కూటమి మేనిఫెస్టోలో మహిళలు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవాలని ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు.
కూటమి అక్రమాలకు పోలీసుల వత్తాసు
పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు ఎన్నికల కమిషన్ పరిధి. అంతమాత్రానా ఆ పరిధి బయట ఎవరు ఎలా అయినా ప్రవర్తించవచ్చు.. ఎన్నికల అక్రమాలకు పాల్పడవచ్చని కాదు అర్థం. ఆ పరిధి దాటాకా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంత పరిస్థితులు కొనసాగేలా చూడటం పోలీసుల విధి. ఆ వంద మీటర్ల పరిధి బయట కూడా పోలీసు యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉంటాయి. ఇతర పోలీసు నిబంధనలు, నియంత్రణలు వర్తిస్తాయి. వాటిని కచ్చితంగా పాటిస్తూ ప్రశాంత పరిస్థితులు కొనసాగేలా పోలీసులు పర్యవేక్షించాలి. అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లు, దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. పోలింగ్ ముగిసేవరకు మొత్తం మున్సిపల్, స్థానిక సంస్థల పరిధిలో శాంతిభద్రతలు, ప్రశాంత పరిస్థితుల పరిరక్షణ పోలీసుల బాధ్యత.
అందుకోసం చట్టంలో స్పష్టంగా నిర్దేశించిన నిబంధనలివీ
సెక్షన్ 126, ఆర్‌పీ యాక్ట్–1951
ఈ చట్టం ప్రకారం సంబంధిత మున్సిపల్, స్థానిక సంస్థల పరిధిలోని ప్రజలు, ఓటర్లు కానివారు రాకుండా పోలీసులు అడ్డుకోవాలి. పులివెందులలో ఎన్నికల అక్రమాల కోసం జమ్మలమడుగు, కమలాపురం తదితర నియోజకవర్గాల నుంచి రౌడీలను టీడీపీ పెద్దలు రప్పిస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవాలి. అదేవిధంగా ఇతర మున్సిపల్, స్థానిక సంస్థలలో కూడా బయట వ్యక్తులు రాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలి. కానీ టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్న పోలీసు యంత్రాంగం తమ బాధ్యతను విస్మరిస్తోంది.
రూల్ 49 జే, రూల్ 49 ఎన్, ఎన్నికల చట్టం–1961
ఈ నిబంధన ప్రకారం బోగస్ ఓటర్లను అడ్డుకోవాలి. అలా అడ్డుకునే హక్కు పోలింగ్ ఏజెంట్లకు ఉంది. అందుకోసం అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లను తప్పనిసరిగా పోలింగ్ బూత్‌లలో అనుమతించేలా పోలీసులు చర్యలు చేపట్టాలి. ఇక బోగస్ ఓటర్లపై పోలింగ్ ఏజెంట్లు లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల అధికారులు, పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ.. అసలు వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లే లేకుండా అడ్డుకునేందుకు టీడీపీ బరితెగిస్తున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇక ఉన్న ఏజెంట్లు బోగస్ ఓటర్లపై అభ్యంతరం తెలిపితే పోలీసులు ఎలా స్పందిస్తారన్నది సందేహాస్పదంగా ఉంది.
సెక్షన్ 130, ఆర్‌పీ యాక్ట్–1951
పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లకు పూర్తి భద్రత కల్పించాలి. అందుకోసం అవసరమైన స్థాయిలో భద్రతా సిబ్బందిని నియోగించాలి. మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిగా వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయాలి. కానీ.. అసలు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎంతమంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నదీ ఇప్పటివరకు వెల్లడించకపోవడం గమనార్హం.
పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144
ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల పరిధిలో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమలులో ఉంటాయి. అంటే కేవలం పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపేకాదు.. బయట కూడా పోలీసు నిబంధనలు, నియంత్రణలు వర్తిస్తాయి. పోలింగ్ రోజుల్లో ప్రజలు ఎవరూ గుమిగూడకూడదు. ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించకూడదు. ఎటువంటి మారణాయుధాలు కలిగి ఉండకూడదు. కానీ.. టీడీపీ పెద్దలు రప్పిస్తున్న రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు పోలింగ్ కేంద్రాల వంద మీటర్ల పరిధి బయట తిష్ట వేసేందుకు సిద్ధపడుతున్నాయి. సామాన్య ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకుని భీతావహ పరిస్థితులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఆ ఆకతాయి, అరాచక మూకలను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం మాత్రం ప్రభుత్వ పెద్దల పచ్చ కుట్రలకు వత్తాసు పలకుతుండటం విస్మయపరుస్తోంది.


