శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ముంపునకు గురైన లొద్దపుట్టి, అయ్యవారిపేట గ్రామాలు.. హైవేపై నిలిచిన వాహనాలు
ప్రాథమికంగానే 9.38లక్షల ఎకరాల్లో నష్టం
అత్యధికంగా 8.64 లక్షల ఎకరాల్లో వరిచేలు మునక
39 వేల ఎకరాల్లో నేలకొరిగిన అరటి
10 వేల ఎకరాల్లో కూరగాయల పంటలకూ తీవ్ర నష్టం
మరో 10వేల ఎకరాల్లో మినుము, 4500 ఎకరాల్లో పత్తికి నష్టం
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో 6.21 లక్షల మంది రైతులకు అపార నష్టం
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: అర్నబ్ తుపాను అన్నదాతకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, కోస్తాంధ్రలో అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రాథమిక లెక్కల ప్రకారం దాదాపు 6.21 లక్షల మంది రైతులకు చెందిన 9.38 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 8.80 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 58వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే.. 12 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఈ తుపాను ప్రభావానికి గురై..తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.
ప్రాథమికంగా 291 మండలాల పరిధిలోని 7613 గ్రామాల్లో 5.42 లక్షల మంది రైతులకు చెందిన 8.80 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 215 మండలాల పరిధిలోని 1310 గ్రామాల్లో 78,967 మంది రైతులకు చెందిన 58,029 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రకటించారు. అత్యధికంగా 8.64 లక్షల ఎకరాల్లో వరి, 38,874 ఎకరాల్లో అరటి, 10 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 10 వేల ఎకరాల్లో మినుము, 4,498 ఎకరాల్లో పత్తి, 3,189 ఎకరాల్లో కొబ్బరి, 1,790 ఎకరాల్లో బొప్పాయి. 1,094 ఎకరాల్లో పసుపు, 966 ఎకరాల్లో పూల తోటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు.
మొక్కజొన్న, టమాటా, మిరప, పామాయిల్, పండ్ల తోటలకు కూడా అపార నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. ఉద్యాన పంట వరకు ఎస్‌డీ ఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.739.75 కోట్లు, వ్యవసాయ పంటలకు సుమారుగా రూ.వెయ్యి కోట్లు నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఇక 12 జిల్లాల్లో 46 ఆవులు, గేదెలు, 63 గొర్రెలు, మేకలు, 32 దూడలు, 7656 కోళ్లు మృతి చెందాయని లెక్కతేల్చారు. కాగా 140 షెడ్లు దెబ్బతిన్నట్టు గుర్తించారు. మరొకవైపు 9 జిల్లాల్లో 1884 పడవలు, 3224 వలలు దెబ్బతినగా, 11,483.39 ఎకరాల్లో ఆక్వా సాగుౖపై ఈ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిందని ప్రకటించారు.
పశుసంవర్ధక శాఖకు రూ.50.38 లక్షలు, మత్స్యశాఖకు రూ.176.82 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో 49,915 హెక్టార్లలోని వరి పంట నేలవాలి నీటిపాలైంది. 6,500 హెక్టార్లలోని అరటిపంట దెబ్బతింది. మినుములు 810 హెక్టార్లలో, ఇతర పంటలు 30 హెక్టార్లలో, ఉద్యానవన పంటలు 1,500 హెక్టార్లలో నీట మునిగాయి. మొత్తంగా జిల్లాలోని 80 వేల మందికిపైగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కోలుకోని కోనసీమ
అర్నబ్ సృష్టించిన విలయం నుంచి కోనసీమ ఇంకా కోలుకోలేదు. వేలాదిగా విద్యుత్ స్తంభాలు కూలడం, వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పల్లెలు, పట్టణాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఇళ్లల్లో దీపాలు వెలగక, ఫ్యాన్లు తిరగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గురువారం నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు మూడు నాలుగు మండల కేంద్రాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విద్యుత్ సరఫరాను సిబ్బంది పునరుద్ధరించగలిగారు.

తీర ప్రాంత మండలాల్లోని శివారు గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు పట్టణాలు, పల్లెల్లో కరెంటు లేక, మోటార్లు పని చేయక తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇళ్లు దెబ్బతిన్న ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరద ముంపులో ఇచ్ఛాపురం
అర్నబ్ తుపాను శ్రీకాకుళంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఒడిశాకు ఆనుకుని ఉన్న ఇచ్ఛాపురం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. ఒడిశాలోని భగలట్టీ డ్యామ్ నుంచి నీరు కిందకు విడుదల చేయడంతో గురువారం ఉదయం 11 గంటల సమయానికి బాహుదా నదిలో వరద 86,458 క్యూసెక్కులకు చేరింది. బుధవారం అర్ధరాత్రి నుంచి బాహుదానది, పద్మనాభపురం(దండు) గెడ్డలు ఉప్పొంగడంతో ఇన్నేశుపేట, డొంకూరు, లక్ష్మీపురం, జగన్నాథపురం, శాసనాం, బిర్లంగి, బి.తోటూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లొద్దపుట్టి, తేలుకుంచి, రత్తకన్న, మశాఖపురం, బొడ్డబడ గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావడంతో ఇళ్లు మునిగిపోయాయి.

దాదాపు 30 ఏళ్లు తర్వాత మళ్లీ ఇంత ఉపద్రవం వచ్చిందని చెబుతున్నారు. స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారి పూర్తిగా జలమయం కావడంతో కోల్‌కత్తా నుంచి చెన్నై రాకపోకలు సాగించే లారీలు, బస్సులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయి. మిగతా ప్రాంతాల్లోనూ పంటలు నీటమునిగాయి. బుధవారం వరకు వరి పంటకు 12921.37 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌ల మీదకు నీరు చేరడంతో జిల్లా మీదుగా రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. హిరమండలంలోని వంశధార గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విశాఖలో విధ్వంసం
విశాఖలోనూ అర్నబ్ తుపాను విధ్వంసం సృష్టించింది. జిల్లాలో 1130కిపైగా వృక్షాలు నేలమట్టమయ్యాయి. 309 విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోయాయి. 34.4 హెక్టార్లలో వరి, ఇతర పంటలు ధ్వంసమవ్వగా.. 53.42 హెక్టార్లలో ఉద్యానపంటలు నాశనమయ్యాయి. అయితే.. ఇంతవరకూ పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులు ఎవ్వరూ వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించలేదని రైతులు చెబుతున్నారు.


